మూడోసారీ కేసీఆరే సీఎం .. హంగ్ కోసం బీజేపీ ఆరాటం: అసదుద్దీన్​ ఒవైసీ

మూడోసారీ కేసీఆరే సీఎం .. హంగ్ కోసం బీజేపీ ఆరాటం: అసదుద్దీన్​ ఒవైసీ
  • మూడోసారీ కేసీఆరే సీఎం .. హంగ్ కోసం బీజేపీ ఆరాటం: అసదుద్దీన్​ ఒవైసీ
  • కాంగ్రెస్ వైఫల్యంతోనే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది
  • రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ వాది
  • 9 సీట్లలో మాకు ఓటేయండి
  • 110 స్థానాల్లో ‘మామ’(కేసీఆర్‌‌)ను గెలిపించండి.. మీట్ ది ప్రెస్ లో మజ్లిస్ అధినేత కామెంట్స్

 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, మూడో సారీ కేసీఆర్‌‌ సీఎం కావడం ఖాయమని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన మీట్‌‌ ది ప్రెస్‌‌లో ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో హంగ్ రావాలని ప్రయత్నిస్తోందని, దీని ద్వారా వచ్చే లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషించారు. కానీ రాష్ట్ర ఓటర్లు చైతన్యవంతులని, ఆ చాన్స్​ బీజేపీకి ఇవ్వబోరని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మజ్లిస్ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, మిగిలిన 110 నియోజవర్గాల్లో ‘మామ’ (సీఎం కేసీఆర్)కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మాముకు సాత్‌‌ దో ” అంటూ బీఆర్ఎస్​కు సహకరిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. బీజేపీని ఓడించాలంటే, ఓట్లు చీలకూడదని, అందువల్లే తాము బలంగా ఉన్న నిజామాబాద్ రూరల్, అర్బన్, కరీంనగర్, ముషీరాబాద్, మహబూబ్‌‌గర్ వంటి స్థానాల్లో కూడా పోటీ చేయట్లేదన్నారు. నిజామాబాద్​లో ఆర్ఎస్ఎస్ బలపడొద్దనే తాము ఎంఐఎం క్యాండిడేట్​ను పెట్టలేదన్నారు. జూబ్లీహిల్స్‌‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ పార్టీ పోటీ చేసిన అన్ని  స్థానాల్లో గెలుస్తామన్నారు.  

ముస్లింల మద్దతు వల్లే కాంగ్రెస్​ బతికుంది

దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం పోటీ చేస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే అక్కడ బీజేపీ గెలుస్తున్నదని, దాన్ని ఒప్పుకోలేకే తమపై నిందలు వేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ కారణంగానే కేంద్రంలో బీజేపీ గెలుస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపునకు తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాత ముత్తాతల నుంచి పోటీ చేస్తున్న కంచుకోట వంటి అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారని, ఇక ఆయన తమ పార్టీ అభ్యర్థుల్ని ఏం గెలిపించుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్​ను ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎంఐఎం భయంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇక్కడ ఆ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. ముస్లింల మద్దతు వల్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బతికుందని గుర్తు చేశారు.

అజారుద్దీన్‌‌ ఓ విఫల నాయకుడు

అజారుద్దీన్ మంచి క్రికెటర్ అని, ఓ విఫల నాయకుడు కూడా అని అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు. హెచ్​సీఏ ప్రెసిడెంట్​గా ఆయనన్ను చేసిందే కేటీఆర్ అని గుర్తుచేశారు. జాబ్లీహిల్స్​ స్థానంలో తాము చాలా ఏళ్లుగా పోటీ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో మతం ప్రాతిపదిక కాదని, తమది సెక్యులర్ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఏ మాత్రం నియోజకవర్గం కోసం పని చేయలేదన్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో నిలబెట్టిందన్నారు. రాజేంద్రనగర్​లో తమ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఆరోగ్య సమస్యల కారణంగా పోటీ చేయలేనని చెప్పారని, అందుకే మరో అభ్యర్థికి బీఫామ్ ఇచ్చామన్నారు. ప్రజల ఫిర్యాదులే తమ మేనిఫెస్టో అని తెలిపారు. దారుస్సలాంలో నిత్యం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల్ని స్వీకరించి, వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. అందుకే తమకు ప్రజలు వరుస విజయాలు అందిస్తున్నారన్నారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చే ప్రతిపాదనపై స్పందిస్తూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి వారి పాఠాల్ని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి విరాహత్ అలీ సమన్వయకర్తగా వ్యవహరించారు. టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు , హెచ్ఐయూజే నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌‌ రిమోట్‌‌ మోహన్‌‌ భగవత్‌‌ చేతిలో..

గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆర్ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆర్​ఎస్​ఎస్​తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఆయన పక్కా ఆర్ఎస్ఎస్ వాది అని, గతంలో ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఎవరు ఎన్ని చెప్పినా, బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని చోట్ల మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము మాత్రమే పనిచేస్తున్నామని, దాని వల్ల నష్టపోతున్నది కూడా తామేనన్నారు.