- వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ప్రకటించనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 18 నుంచి జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ని ఆవిష్కరించనున్నది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని విస్తరించడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీ రూపొందించింది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీ ప్రకటించనున్నది.
ఫార్మా రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గ్రీన్ ఫార్మా సిటీ’కి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఈ పాలసీ ద్వారా స్పష్టం చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని డెవలప్ చేసే ప్రణాళికను ప్రకటించనున్నారు. కాలుష్య రహితంగా (జీరో లిక్విడ్ డిశ్చార్జ్), నివాసం, పని ప్రదేశాలు ఒకేచోట ఉండేలా ‘వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే’ విధానంలో దీని రూపకల్పన ఉండనున్నట్లు సమాచారం.
