
- ఘట్కేసర్లో మర్డర్..
- కారులో కర్నాటకకు డెడ్‌బాడీ తరలింపు..అక్కడి కాఫీ తోటలో దహనం
ఘట్కేసర్, వెలుగు : అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన మహిళ.. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని నమ్మించి మరో పెళ్లి చేసుకుంది. కంపెనీ మారుతున్నానని చెప్పి, అందులో పెట్టుబడి కోసం భర్త నుంచి రూ.2 కోట్లు అడిగి తీసుకుంది. తీరా ఆమె ఫేక్ ఉద్యోగి అని తెలియడంతో డబ్బులు తిరిగిచ్చేయాలని భర్త డిమాండ్ చేశాడు. దీంతో ప్రియుడితో కలిసి అతడిని భార్య హత్య చేసింది. డెడ్‌బాడీని గుట్టుచప్పుడు కాకుండా కర్నాటకకు తరలించి దహనం చేయగా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కేసు రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులను బుధవారం ఘట్కేసర్కు తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఘట్కేసర్పరిధిలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేశ్ కుమార్ (52), భువనగిరికి చెందిన నిహారిక (29)కి నాలుగేండ్ల కింద పెళ్లి జరిగింది. రమేశ్ కుమార్‌కు అప్పటికే ఒక పెళ్లి జరిగి కుతూరు ఉండగా, నిహారికకు గతంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. పలు కారణాలతో వారితో విడిపోయిన మహిళ తాను విప్రోలో పనిచేస్తున్నానని మ్యాట్రిమోనీ ద్వారా నమ్మించి రమేశ్ ను నాలుగో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులపాటు దంపతులిద్దరూ బాగానే కలిసి ఉన్నారు. అయితే, తాను కంపెనీ మారుతున్నానని, అందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపి భర్త నుంచి రూ.2 కోట్లు అడిగి తీసుకుంది. ఆమె చెప్పిందంతా ఫేక్ అని తెలుసుకున్న భర్త డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. దీంతో డబ్బులు తీసుకోవడానికి భువనగిరికి వెళ్దామని, ఈ నెల 4న మరో వ్యక్తి రాణాతో కలిసి ముగ్గురు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారును ఘట్కేసర్ పరిధి హెచ్‌పీసీఎల్ సంస్థ సమీపంలోని సర్వీసు రోడ్డులో ఆపారు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం భర్తతో భార్యతో మాట్లాడుతుండగా, ప్రియుడు రాణా తన వెంట తెచ్చుకున్న వైర్‌తో ముందు భాగంలో కూర్చున్న రమేశ్ మెడకు చుట్టి హత్య చేశాడు.
అక్కడి నుంచి డెడ్‌బాడీని కారు డిక్కీలో వేసుకొని కర్నాటకలోని కొడగు జిల్లా సుంటికుప్ప గ్రామంలోని కాఫీ తోటకు తీసుకెళ్లి, మరో వ్యక్తి నిఖిల్‌రెడ్డి సహాయంతో దహనం చేసినట్లు నిహారిక, రాణా అంగీకరించారు. అయితే, సగం కాలిన శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను కర్నాటక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు రీ కన్స్ట్రక్షన్లో హత్య తీరును చెప్పిన తరువాత వారిని కర్నాటకకు తీసుకెళ్లారు. కర్నాటక పోలీసులతో పోచారం సీఐ రాజువర్మ, ఘట్కేసర్ సీఐ పరుశురాం, ఎస్ఐలు నాగార్జున రెడ్డి , శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.