హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆతిథ్య రంగం, పర్యాటక ఆకర్షణలు, మ్యూజియంలు, సాంకేతిక ఆధారిత సేవల విభాగాల్లో తొలి పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ స్పెషల్‌సీఎస్ వాణి ప్రసాద్ అన్నారు. మయామిలో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ ఎక్స్‌పోకు బుధవారం ఆమెతోపాటు టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ హాజరయ్యారు. దాదాపు 70 దేశాల ప్రతినిధులు వచ్చిన ఈ ప్రదర్శనలో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు సన్నాహకాల్లో భాగంగా అమెరికా ఇన్వెస్టర్లతో స్పెషల్‌సీఎస్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో గుర్తించిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల్లో ఉన్న విస్తారమైన వనరులు, పెట్టుబడి అవకాశాలను ఆమె వివరించారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని నేషనల్ జియోగ్రాఫిక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాన్ డ్రూ ప్రశంసించారు.అమెరికా పర్యాటకులకు, పెట్టుబడిదారులకు డిస్కవర్ తెలంగాణ అనే నినాదంతో మరింత చేరువ కావాలని ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ హెడ్ సునీల్ హాలి సూచించారు.
రెండు నగరాల మధ్య బంధాన్ని వివరిస్తూ.. న్యూయార్క్ హైదరాబాద్‌ను కలుస్తోందని న్యూయార్క్ మేయర్ కార్యాలయ డిప్యూటీ చీఫ్ బిజినెస్ డైవర్సిటీ ఆఫీసర్ దిలీప్ చౌహాన్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న స్పందనపై టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. నూతన పర్యాటక విధానం ద్వారా సుమారు 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు.
