కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
  • రేపు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ గుబులు రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముందస్తు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు రేపు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ విస్తరణ తీరు, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై వైద్య నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా కొత్త వేరియంట్  వ్యాపిస్తున్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

ఇదే విషయంలో  ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ తీవ్రంగా ఉన్న దక్షిణాఫ్రికా దేశం నుంచి నేరుగా హైదరాబాద్ కు ఎలాంటి విమాన సర్వీసులు లేని కారణంగా ముంబయి, ఢిల్లీలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వారి ట్రేసింగ్, టెస్టింగులకి సంబంధించి మంత్రి హరీష్ రావు చర్చించనున్నట్లు సమాచారం.