ఐదేండ్లలో తెలంగాణ ., అప్పు డబుల్ : నిర్మలా సీతారామన్

 ఐదేండ్లలో తెలంగాణ ., అప్పు డబుల్ :  నిర్మలా సీతారామన్

 

  • ఐదేండ్లలో తెలంగాణ ., అప్పు డబుల్ 
  • పార్లమెంట్‌‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
  • బీఆర్ఎస్ ఎంపీ నామా ప్రశ్నకు రాతపూర్వక సమాధానం
  • 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.లక్షా 90 వేల కోట్లు 
  • 2023 మార్చి నాటికి రూ.3 లక్షల 66 వేల కోట్లకు..
  • గతేడాదితో పోల్చితే 16.6 శాతం పెరిగినట్లు ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు:  ఐదేండ్లలో తెలంగాణ అప్పు దాదాపు డబుల్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 మార్చి నాటికి రూ.1,90,203 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు.. 2023 మార్చి నాటికి రూ.3,66,306 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. సోమవారం పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘స్టేట్ ఫైనాన్స్‌‌లు: 2022–23 బడ్జెట్‌‌ల అధ్యయనం’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2018 నుంచి తెలంగాణ అప్పు ఏటా పెరుగుతున్నట్లు వివరించారు. ‘‘గతేడాదితో పోల్చితే ఈ అప్పు 16 శాతం పెరిగింది. ఐదేండ్లలో నాబార్డు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.5,531.55 కోట్లు అప్పుగా తీసుకున్నారు. 

ఇందులో 2019–20లో రూ.1,500 కోట్లు మంజూరు కాగా.. రూ.508.66 కోట్లు అందాయి. 2020–21లో రూ.4,674.83 కోట్లు మంజూరు కాగా, రూ.2,394.70 కోట్లు రిలీజ్ అయ్యాయి. 2021–22 లో రూ.2, 051.14 మంజూరు కాగా, రూ.2, 628.19 కోట్లను నాబార్డ్ ఇచ్చింది” అని వెల్లడించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్స్‌‌‌‌ కార్పొరేషన్ 2018లో రూ.598.91 కోట్లు, 2020లో రూ.275.75 కోట్లు 2021లో రూ.533.31 కోట్ల రుణం పొందినట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌కు నాబార్డు నుంచి 2018–19లో రూ.526.26 కోట్లు రిలీజ్ అయ్యాయని పేర్కొన్నారు. 

సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌‌‌‌కు రూ.37,825 కోట్లు

అలాగే క్రెడిట్ ఫెసిలిటీ టూ ఫెడరేషన్స్(సీఎఫ్ఎఫ్) కింద తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (టీఎస్‌‌‌‌సీఎస్‌‌‌‌సీఎల్‌‌‌‌)కు 2020–21కి రూ.25 వేల కోట్లు, 2021–22కి రూ.5,600 కోట్లు, 2022–23కి రూ.7,225 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి నిర్మల వెల్లడించారు. టీఎస్ మార్క్ ఫెడ్ రూ.483 కోట్ల రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రూరల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్) కింద 2018–19 నుంచి 2022–23 మధ్య రూ.4, 419 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేర్ హౌసింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (డబ్ల్యూఐఎఫ్) కింద తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేండ్లలో రూ.97.41 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు.