తగ్గుతున్న పిల్లలు పెరుగుతున్న వృద్ధులు! ..రాబోయే పదేండ్లలో ఏజింగ్ స్టేట్గా తెలంగాణ

తగ్గుతున్న పిల్లలు పెరుగుతున్న వృద్ధులు! ..రాబోయే పదేండ్లలో  ఏజింగ్ స్టేట్గా తెలంగాణ
  • రాబోయే పదేండ్లలో ఏజింగ్​ స్టేట్​గా తెలంగాణ
  • రాష్ట్రంలో1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు
  •     ప్రస్తుతం జనాభాలో 60 ఏండ్లు దాటిన 
  • వృద్ధులు 11%.. 2036 కల్లా 17.1% శాతానికి
  •     పనిచేసే వందమందిపై ఆధారపడనున్న 
  • 26 మంది వృద్ధులు మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం 
  •     స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26
  • రిపోర్ట్​లో ఆర్బీఐ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోగా, రాబోయే పదేండ్లలో అంటే 2036 నాటికి రాష్ట్రం ‘ఏజింగ్ స్టేట్’ (వృద్ధాప్య రాష్ట్రం) జాబితాలోకి చేరనుంది. ప్రస్తుతం ‘ఇంటర్మీడియెట్’ దశలో ఉన్న తెలంగాణలో జనాభా కూర్పు వేగంగా మారుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పెన్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్బీఐ హెచ్చరించింది. బిహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పనిచేసే వారి సంఖ్య భవిష్యత్తులో తగ్గిపోనుండడం, వృద్ధుల సంఖ్య పెరగనుండటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-–26’ నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుండగా, తెలంగాణ  రాబోయే పదేండ్లలో ఏజింగ్ స్టేట్  జాబితాలోకి చేరనుందని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం, ఆయుర్దాయం పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నది.  ఇది రాష్ట్ర ఖజానాపై, ముఖ్యంగా పెన్షన్లు,  హెల్త్​ ఖర్చులపై   తీవ్ర ప్రభావం చూపుతుందని  హెచ్చరించింది. రాబోయే ఈ ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.  ఇప్పుడు అందుబాటులో ఉన్న యువతకు సరైన నైపుణ్యాలు అందించి, ప్రొడక్టివిటీ పెంచడంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని నిర్దేశించింది.  ఆరోగ్య రక్షణ రంగంలో వృద్ధులకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేయాలని,  పెన్షన్ల భారాన్ని తట్టుకునేందుకు ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వృద్ధాప్యం అనివార్యమైనప్పటికీ, దానికి సన్నద్ధం కావడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవచ్చని వెల్లడించింది.

రీప్లేస్‌‌‌‌మెంట్ స్థాయి కంటే తక్కువ

తెలంగాణలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఉండాల్సిన రీప్లేస్‌‌‌‌మెంట్ రేటు 2.1 కాగా, తెలంగాణలో ఇది ప్రస్తుతం 1.5కి పడిపోయిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అంటే ఇద్దరు తల్లిదండ్రులకు సగటున ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం లేదు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరసన తెలంగాణ కూడా చేరింది. బిహార్‌‌‌‌లో ఈ రేటు 2.9గా, ఉత్తర ప్రదేశ్‌‌‌‌లో 2.6గా, మధ్యప్రదేశ్‌‌‌‌లో 2.5గా ఉంది. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుండగా, తెలంగాణ, కేరళ (1.5), పశ్చిమ బెంగాల్ (1.4) వంటి రాష్ట్రాల్లో జననాలు భారీగా తగ్గుతున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో తెలంగాణలో పిల్లల సంఖ్య తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగి, సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో తెలంగాణలో యువత సంఖ్య తగ్గిపోయి, పనిచేసే వారి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  దీంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఆర్బీఐ  విశ్లేషించింది.  ఏ రాష్ట్రానికైనా 'వర్కింగ్ ఏజ్ పాపులేషన్' ఎక్కువగా ఉంటే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. దీనినే 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' అంటారు.  కానీ తెలంగాణకు ఈ అవకాశం( విండో ఆఫ్ ఆపర్చునిటీ) వేగంగా మూసుకుపోతోందని ఆర్బీఐ తెలిపింది. తెలంగాణలో పనిచేసే వయసున్న జనాభా వాటా 2026లో 67.8 శాతంగా గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. 2036 నాటికి ఇది 66.7 శాతానికి పడిపోతుంది. అదే సమయంలో మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పనిచేసే వారి వాటా 2036 తర్వాత కూడా పెరుగుతూనే ఉంటుంది. తెలంగాణ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ రిపోర్ట్​ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, తలసరి ఆదాయం పెంచుకోవడానికి ఉన్న సమయం తగ్గిపోతోందని పేర్కొన్నది.

పెరగనున్న పెన్షన్లు ,హెల్త్​ భారం

వృద్ధుల సంఖ్య పెరిగితే అది నేరుగా రాష్ట్ర బడ్జెట్‌‌‌‌పై ప్రభావం చూపనుంది. పనిచేసే వయసున్న జనాభా తగ్గడం వల్ల పన్ను రాబడి తగ్గే అవకాశం ఉండగా, వృద్ధుల కోసం ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు, వారికి వైద్య సేవలు, సామాజిక భద్రత కోసం బడ్జెట్‌‌‌‌లో ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ పరిస్థితి ఉందని, తెలంగాణ కూడా అదే దారిలో వెళ్తున్నదని ఆర్బీఐ పేర్కొంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. 

ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య తీవ్ర అంతరం

దేశంలోని వివిధ రాష్ట్రాలు జనాభా మార్పులో వేర్వేరు దశల్లో ఉన్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. బిహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు యువ దశలో ఉన్నాయి. అక్కడ 2060 వరకు కూడా పనిచేసే జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ‘ఏజింగ్’ దశలోకి వచ్చేశాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక వంటి రాష్ట్రాలు ‘ఇంటర్మీడియట్’ దశలో ఉండి, వేగంగా వృద్ధాప్యం వైపు మళ్లుతున్నాయి. ఈ అసమానతల వల్ల భవిష్యత్తులో కేంద్ర నిధుల పంపిణీలో, లేబర్ ఫోర్స్ లభ్యతలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. 

17.1 శాతానికి వృద్ధులు

ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి వాటా 11.0 శాతంగా (2021 లెక్కల ప్రకారం) ఉంది. కాగా, ఇది వేగంగా పెరుగుతోంది. ఆర్బీఐ అంచనాల ప్రకారం 2026 నాటికి ఇది 12.5 శాతానికి, 2031 నాటికి 14.5 శాతానికి, 2036 నాటికి ఏకంగా 17.1 శాతానికి చేరుకోనుంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 15 శాతం దాటితే ఆ రాష్ట్రాన్ని ‘ఏజింగ్ స్టేట్’గా పరిగణిస్తారు. ఈ లెక్కన మరో పదేళ్లలో తెలంగాణ వృద్ధాప్య రాష్ట్రాల జాబితాలో చేరనుంది. ఇది సామాజికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా రాష్ట్రానికి పెను సవాలుగా మారనుంది. యువతరం తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’   ప్రయోజనాన్ని పొందే సమయం రాష్ట్రానికి తగ్గిపోతోందని నివేదిక స్పష్టం చేసింది.  రాష్ట్రంలో పనిచేసే వయసున్న (15- నుంచి 59 ఏండ్లు) వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య  భారీగా పెరుగుతోంది. 2011లో ప్రతి 100 మంది పనిచేసే వారికి 14.5 మంది వృద్ధులు ఉండగా, 2036 నాటికి ఈ సంఖ్య 25.7కు చేరుకోనుంది. అంటే అప్పుడు ప్రతి నలుగురు సంపాదనపరులు ఒక వృద్ధుడిని పోషించాల్సి వస్తుంది. ఇది కేరళ (38.3), తమిళనాడు (32.7) తర్వాతి స్థానాల్లో ఉంటుంది. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్‌‌‌‌లో ఈ నిష్పత్తి 17.9గా, బీహార్‌‌‌‌లో 17.8గా మాత్రమే ఉండనుంది.  ఈ నిష్పత్తి పెరగడం వల్ల కుటుంబాల పొదుపు తగ్గుతుంది, అలాగే రాష్ట్రంపై సామాజిక భద్రతా భారం పెరుగుతుంది. ఇది అంతర్రాష్ట్ర వలసలకు కూడా దారితీయవచ్చని నివేదిక అంచనా వేసింది.