బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నం : మంత్రి రాజ్‌‌ భూషణ్‌‌ చౌదరి

బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్నం : మంత్రి రాజ్‌‌ భూషణ్‌‌ చౌదరి
  •     రాజ్యసభలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి (పోలవరం)-–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ఆందోళన నేపథ్యంలో తగు విధివిధానాలను రూపొందించి ముందుకు వెళ్తాతామని స్పష్టంచేసింది. 

ఈ ప్రాజెక్టు గోదావరి బేసిన్‌‌ పరిధిలోకి వస్తున్నందున ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్​)ను తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాలకు పంపినట్టు వెల్లడించారు. అలాగే, దీనికి సంబంధించిన ఇతర సంస్థలతోనూ చర్చిస్తున్నట్టు తెలిపారు. 

ఈ మేరకు సోమవారం రాజ్యసభలో  కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌‌ భూషణ్‌‌ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వదర నీరు తరలింపు పేరుతో ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన... పోలవరం - బనకచర్ల లింక్‌‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పీఎఫ్‌‌ఆర్‌‌ను కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించిందని సభకు తెలిపారు. 

ప్రస్తుతం.. ఈ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అజ్జర్వేషన్లో ఉందన్నారు. గోదావరి బేసిన్ లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు సాంకేతిక అంశాలను నిబంధనల మేరకు పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. మరోవైపు.. ఈ ప్రాజెక్ట్ విషయంలో టెక్నో ఎకానమిక్ అప్రైజల్‌‌ (సాంకేతిక, ఆర్థిక మదింపు) కోసం డ్యూ ప్రాసెస్‌‌ (నిర్దేశిత ప్రక్రియ)ను అనుసరిస్తున్నట్లు సమాధానంలో పొందుపరిచారు.