
- రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు
- 10 లక్షల టన్నుల పెంపునకు అన్ని జిల్లాల్లో స్థల సేకరణ
- ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్లాన్
- రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు: “ రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం. ఇప్పటికే దాదాపు 25 జిల్లాల్లో అదనపు గోడౌన్ల నిర్మాణానికి స్థల కేటాయింపు పూర్తయింది. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష టన్నుల కెపాసిటీ గోడౌన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.”అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్రాయల నాగేశ్వరరావు తెలిపారు. చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా ‘వెలుగు’తో మాట్లాడారు. సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ప్రణాళికలను వివరించారు. ఆయన మాటల్లోనే..
ఏటా రూ.70 కోట్ల వరకు ఆదాయం
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ లో 8 మంది డైరెక్టర్లకు గాను నలుగురు కేంద్రం నుంచి మరో నలుగురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నారు. బోర్డు సమావేశంలోనే అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదిస్తున్నాం. సంస్థకు రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ఆధ్వర్యంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు ఉన్నాయి.
అగ్రికల్చర్మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఉన్న గోడౌన్లు 5 లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగిన వాటిని ప్రస్తుత అవసరాలకు అద్దెకు తీసుకుంటున్నాం. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల వరకు కిరాయికి తీసుకుని నిర్వహిస్తున్నాం. అన్నీ ఖర్చులు పోను ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
ఇందులో 50 శాతం కేంద్రం వాటా, మిగిలిన 50 శాతం రాష్ట్ర సర్కార్ గా ఉంటుంది. సొంత గోడౌన్లలో మరో ఏడాదిలోగా 10 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే 15 నుంచి 20 ఎకరాల్లో కొత్త గోడౌన్లను నిర్మించనున్నాం. ఇప్పటివరకు 25 జిల్లాల్లో స్థలాలను కేటాయించగా.. కొన్ని చోట్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.
లక్ష టన్నుల కెపాసిటీతో గోడౌన్లు
ఖమ్మం జిల్లా నుంచి 50 ఏండ్ల కింద తోట పుల్లయ్య కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అప్పట్లో పెద్ద తండాలో గోడౌన్స్నిర్మించారు. కొత్తగూడెం, పాల్వంచలోనూ గోడౌన్లు కట్టారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రఘునాథపాలెం లో 20 వేల టన్నుల కెపాసిటీతో గోడౌన్ నిర్మించారు. ఇప్పుడు జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
వీరి మద్దతుతో ఖమ్మం జిల్లాలోని ఐదు సెగ్మెంట్లలో 20 వేల టన్నుల చొప్పున లక్ష టన్నుల కెపాసిటీతో గోడౌన్ల నిర్మాణానికి ప్లాన్ చేశాం. ఇప్పటి వరకు కార్పొరేషన్ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీ లేదు. ప్రైవేట్ ఆధ్వర్యంలోని కోల్డ్ స్టోరేజీలకు పోటీగా పాలేరులో కోల్డ్ స్టోరేజీ, దాని పక్కనే గోడౌన్లు నిర్మిస్తున్నాం.
పెద్ద తండాలో షాపింగ్ కాంప్లెక్స్
పెద్దతండాలోని గోడౌన్ల చుట్టూ కాలనీలు డెవలప్కావడంతో ఇండ్ల మధ్య ఉన్నాయి. ఇండ్లలోకి పురుగులు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు రాకుండా గోడౌన్ల ఊరి బయటకు తరలిస్తాం. వాటి స్థానంలో కార్పొరేషన్ కు ఆదాయం వచ్చేలా కమర్షియల్ కాంప్లెక్స్నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం.