
ముంబయికి చెందిన టీవీ నటి రుహి సింగ్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. గత అర్ధరాత్రి తప్ప తాగి డ్రైవింగ్ చేయడమే కాకుండా అడ్డుకున్న ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకోవడంతో.. ఆమెపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి రుహి తన స్నేహితులతో కలసి ఓ పబ్‌లో పీకల దాకా మద్యం సేవించింది. పబ్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఓ షాపింగ్ మాల్ వద్ద వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కారు ఆపింది. అప్పటికే షాపింగ్ మాల్ మూసేయడంతో అక్కడున్న సెక్యూరిటీ లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు.
తమను వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించిన సెక్యూరిటీతో రుహి మిత్ర బృందం గొడవకు దిగింది. దీంతో షాపింగ్ మాల్ సెక్యూరిటీ.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులపై కూడా వారు దాడికి దిగారు. మద్యం మత్తులో తూలుతున్న ఆమెను అదుపు చేయబోయిన అధికారులపై ఇష్టారీతిగా ప్రవర్తించింది. వారిపై చేయి చేసుకుంది. దీంతో పోలీసులు ఆమెపై ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 279 కింద, పోలీసు అధికారులపై చేయి చేసుకున్నందుకు సెక్షన్ 353 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆమె స్నేహితులు రాహుల్, స్వాప్నిల్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.