
- 9 ఏళ్లలో దాదాపు9 వేల రైతు మరణాలు
- కేసీఆర్‌కి కంటిపరీక్షలుఅవసరం
- అవసరమైతేఎర్రగడ్డ ఆసుపత్రిలోనూ టెస్టులు చేసుకోవాలె
రాజకీయ లబ్ది కోసం సీఎం కేసీఆర్ రైతు ఆత్మహత్యలపైనా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నోరు తెరిస్తే అబద్దాలేనని మరోసారి నిరూపించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్.. రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు రైతుల ఆత్మహత్యల గురించి ప్రకటించినా.. ఏటా ఎన్సీఆర్బీ ఆత్మహత్యల గణాంకాలు విడుదల చేస్తున్నా.. దొరకు అవి కనిపించడం లేదని అన్నారు. అందుకే ముఖ్యమంత్రికి కంటి పరీక్షలు చేయాలని అన్నారు. మతి తప్పి మాట్లాడుతున్న కేసీఆర్ అవసరమైతే ఎర్రగడ్డలోనూ టెస్టులు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను షర్మిల వెల్లడించారు..
2014 - 430
2015 - 1358
2016 - 632
2017 - 846
2018 - 900
2019 - 491
2020 - 466
2021 - 352
2022 - 512
రికార్డుల ప్రకారం.. సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 5,987 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. ఇంకా రికార్డులకెక్కని ఆత్మహత్యలు మరో మూడు వేల వరకు ఉన్నాయని, అంటే ఇప్పటివరకు దాదాపు 9వేల మంది కేసీఆర్ పాలనకు బలయ్యారని ఆరోపించారు. దొర దిక్కుమాలిన చర్యలతో రైతులు నిండా మునుగుతున్నారని మండిపడ్డారు. కౌలు రైతుకు సాయం చేయాలన్న సోయి లేనోడు దేశాన్ని ఏలబోతాడట అంటూ కామెంట్ చేశారు.
పరిహారం లేదు.. రుణమాఫీ లేదు..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా నిలిచారని షర్మిల అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం కేవలం రూ.5వేల రైతు బంధు ఇచ్చి, అన్ని పథకాలు నిలిపివేశాడని ఆరోపించారు. ప్రగతి భవన్ లో ‘రేపటి నుంచే వందకు వంద శాతం ఎరువులు ఫ్రీ’ అన్న కేసీఆర్.. ఇప్పటి వరకు ఒక్క బస్తా ఇచ్చింది లేదని ఆరోపించారు. ఏటా వరదలొచ్చి పంటలు మునిగి రైతులు నష్టపోతున్నా.. గాలి మోటార్ లో తిరుగుతూ గాలి మాటలు చెప్పడం తప్ప ఒక్క ఎకరాకు పరిహారం ఇచ్చింది లేదని విమర్శించారు.
ఇంకోసారి 24గంటల ఉచిత విద్యుత్ అంటే...
కేసీఆర్ మెదడుకు కరెంట్ షాక్ పెడితే కాని.. కరెంట్ గురించి వాస్తవాలు బయటకు రావని షర్మిల విమర్శించారు. కాళేశ్వరంతోనే తెలంగాణను సస్యశ్యామలం చేశామన్న కేసీఆర్.. పంటలు ఎందుకు ఎండుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో వేల కోట్ల కమీషన్లు దోచుకుని, చేతులు దులుపుకొన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసెత్తడం లేదని ఆరోపించారు. ఉచిత కరెంట్ అని మభ్య పెడుతూనే.. ఛార్జీల పేరుతో ప్రజల రక్తం తాగుతుండని మండిపడ్డారు. ఇంకోసారి కేసీఆర్ నోట 24గంటల ఉచిత విద్యుత్ మాట వసల్తే రైతులంతా తిరగబడి ఉరికించడం ఖాయమని షర్మిల హెచ్చరించారు.