బిగ్‌బాస్ రివ్యూ: వాసంతి కాన్ఫిడెన్స్.. ఫైమా ఓవర్ కాన్ఫిడెన్స్

బిగ్‌బాస్ రివ్యూ: వాసంతి కాన్ఫిడెన్స్.. ఫైమా ఓవర్ కాన్ఫిడెన్స్

సోమవారం వచ్చిందంటే నామినేషన్లకి తెర లేస్తుంది. ఒకరిపై ఒకరు వేసుకునే నిందలు, అవి నిజం కాదంటూ చేసుకునే వాదనలు, కొందరి అరుపులు, మరికొందరు మూతి విరుపులు.. మొత్తంగా ఇల్లంతా రణరంగమే. ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. 

ఇదేం స్ట్రాటజీ సూర్యా!

నామినేషన్ ప్రక్రియ మొదలు కావడానికి ముందు కాసేపు ఇంట్లో చర్చలు జరిగాయి. బాలాదిత్య, గీతూ మళ్లీ ఆ డైలాగ్ టాస్క్ విషయంలో ఆర్గ్యుమెంట్‌కి దిగారు. ఎంత కన్విన్స్ చేద్దామని అతను ట్రై చేసినా ఆమె వినకపోవడంతో విసుగొచ్చి వదిలేశాడు. ఇక అసలు హైలైట్ ఏంటంటే సూర్య, ఇనయాల చర్చ. మనిద్దరి రిలేషన్‌ని అందరూ తప్పు అంటున్నారు కాబట్టి ఏమీ లేనట్టు, గొడవ పడుతున్నట్టు నాటకమాడదాం అని ప్లాన్ చేసుకున్నారిద్దరూ. ఏమైనా అర్థం ఉందా అసలు? నాగార్జున అన్నారు, ఆడియెన్స్ అన్నారు. అంటే ఆ టాక్ బయట నడుస్తోందనే విషయం కూడా వీళ్లిద్దరికీ అర్థం కావడం లేదా. గొడవ పడుతున్నట్టు నటిస్తూ ఇంట్లోవాళ్లని నమ్మించగలరు కానీ ప్రేక్షకుల్ని ఎలా నమ్మిస్తారు! ఇదేం సిల్లీ స్ట్రాటజీనో ఏంటో. పైగా ఇదేదో గొప్ప ప్లాన్ అయినట్టు సూర్య మళ్లీ కెమెరా ముందు పర్‌‌ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. మేమిలా అనుకుంటున్నాం బిగ్‌బాస్, అదే చేస్తాం అంటూ వివరించి చెప్పాడు. అమ్మనో బుజ్జమ్మనో పట్టుకుని గట్టిగా ఏడవాలనుంది అంటూ సెంటిమెంట్ టచ్ ఒకటి. ఇక్కడ ఇనయాతో పిచ్చి వేషాలు వేస్తూ మాటిమాటికీ అమ్మ, బుజ్జమ్మ అంటే కవర్ అయిపోతుంది అనుకోవడం నిజంగా పిచ్చితనమే. 

వెంటాడిన తప్పు.. బాలకి ముప్పు

ఈవారం నామినేషన్ల ప్రకియలో ఎవరూ ఊహించనిది జరిగింది. అందరూ ఎంతో ఇష్టంగా అన్నా అని పిలుచుకునే బాలాదిత్య అందరికీ టార్గెట్ అయ్యాడు. చాలామంది తనని నామినేట్ చేశారు. దానికి కారణం బ్యాటరీ టాస్క్. యాభై శాతం బ్యాటరీని వాడేసుకుని ఇతరులకు అవకాశం లేకుండా చేయడం అన్యాయం అంటూ బాలని అందరూ తప్పుబట్టారు. దానికి అతను ఒప్పుకోలేదు. నావల్ల ఆట ఆగిపోలేదు, కంటిన్యూ అవుతుందనే నమ్మకం ఉండబట్టే అంత వాడుకున్నాను అంటూ జస్టిఫై చేసుకున్నాడు. కానీ అతని ఆలోచన తప్పనే చెప్పాలి. అక్కడ బిగ్‌బాస్ రీచార్జ్కి మరో అవకాశం ఇచ్చాడు కాబట్టి, రోహిత్ పెద్ద మనసుతో త్యాగం చేసి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మిగతా వారందరూ తమ సర్‌‌ప్రైజ్‌లు కచ్చితంగా మిస్సైపోయి ఉండేవారు. కాబట్టి బాలాదిత్య చేసింది తప్పనే చెప్పాలి. అది ఒప్పుకోకుండా ఆట కొనసాగుద్దనే నమ్మకంతోనే నేను బ్యాటరీ వాడేసుకున్నా, ఆ తర్వాత అందరి గురించి చాలా బాధపడ్డా, హౌస్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని మాట్లాడటం అంత సమంజసంగా లేదు. ఇక కీర్తి బాల్ టాస్క్లో తనని సపోర్ట్ చేయనందుకు అతనిని నామినేట్ చేసింది. గీతూయేమో తనని అవసరాల కోసం దారులు తొక్కుతానని అనడం బాధనిపించిందంటూ నామినేట్ చేసింది. దాంతో ఈవారం బాల డేంజర్‌‌ జోన్‌లో పడిపోయాడు.

ఆ అరుపులేంది ఆదిరెడ్డీ!

వారమంతా ఒకలా ఉంటాడు.. నామినేషన్ రోజు మాత్రం తనలో ఉన్న మరో మనిషిని బైటికి తీస్తాడు ఆదిరెడ్డి. ఎదుటివాళ్ల తప్పుల్ని చాలా కాన్ఫిడెంట్‌గా బైటికి చెప్తాడు. ఎదుటివాళ్లు తన తప్పుల్ని ఎత్తి చూపిస్తే మాత్రం తట్టుకోలేక కేకలు పెడతాడు. అతను వాసంతిని నామినేట్ చేసేటప్పుడు లిమిట్స్ దాటి మాట్లాడాడు. నువ్వు నాకంటే తక్కువ డిజర్వింగ్ క్యాండిడేట్‌వి, నా అంత నువ్వు ఆడట్లేదు అంటూ చాలా అవమానించాడు. అలా అనడం కరెక్ట్ కాదు, అలా నువ్వెలా జడ్జ్ చేసేస్తావ్, జనాలు చూసుకుంటారు అని చెబుతున్నా వినకుండా నేనిలాగే మాట్లాడతా అన్నాడు. ఇదే కారణంతో అర్జున్ అతనిని నామినేట్ చేశాడు. ప్రతిసారీ మీరిలా డిసర్వింగ్, లెస్ డిజర్వింగ్ అని చెప్పడం బాలేదు, అది జనాలు ఓట్లతో తేలుస్తారు అని చెబితే రైలింజిన్‌లా రెచ్చిపోయాడు. అది చెప్పడానికి నువ్వెవరు, అలా అయితే నువ్విలా కారణాలు చెప్పి నామినేట్ చేయకు, జనాలు చేస్తార్లే అంటూ సంబంధం లేని లాజిక్కులు మాట్లాడాడు. పైగా ఒకటే అరుపులు. ఎందుకలా అరుస్తున్నారు, మెల్లగా మాట్లాడండి అని అర్జున్ చెబుతున్నా మనోడు తగ్గలేదు. అరవకు అని మధ్యలో గీతూ కూడా చెప్పింది. అయినా లెక్క చేయలేదు. అరుస్తానే ఉన్నాడు. ఇలా ఎదుటివాళ్ల విషయంలో రివ్యూలు ఇచ్చేయడం, తీర్పులు చెప్పేయడం మానుకోమని నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా ఆదిరెడ్డి మారట్లేదు. పైగా నాకు అంతా తెలుసు, నేను చెప్పేదే కరెక్ట్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అతనిలో పెరిగిపోతోంది. ఇది అతనిని ఏదో ఒకరోజు దెబ్బ కొట్టే ప్రమాదం లేకపోలేదు. 

ఇనయా.. మళ్లీ మొదలెట్టిందయా!

ఆటని వదిలేసి సూర్య చుట్టూ తిరుగుతున్నావని ముఖమ్మీదే నాగ్ చెప్పేయడంతో ఇవాళ మళ్లీ పాత ఇనయా బైటికొచ్చింది. అందరూ లయర్స్ అంటూ ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ శ్రీహాన్ నామినేట్ చేశాడు. నేనలా అనలేదు అంటూ వాదించింది ఇనయా. పైగా ఏ కారణం దొరక్క సిల్లీ రీజన్‌తో నామినేట్ చేస్తున్నావ్ అంది. నేనలా అంటే అప్పుడే చెప్పకపోయావా, ఇప్పటి వరకు ఏం చేశావ్, ఈ వారమంతా ఏం పీకావ్ అంటూ మాటలు జారింది. ఆమె ఎలా మాట్లాడినా శ్రీహాన్ బ్యాలెన్స్డ్‌గానే ఉన్నాడు. మాట తూలలేదు. కానీ అతనిని తిరిగి నామినేట్ చేసేటప్పుడు మాత్రం తన అసలు రూపాన్ని మళ్లీ చూపించింది ఇనయా. ఆమె వేసుకున్న డ్రెస్ చమ్కీలు ఊడి సోఫాకి అతుక్కుపోయాయి. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వీటిని ఎలా పోగొట్టాలి అని కెప్టెన్‌తో డిస్కస్ చేశాడు శ్రీహాన్. ఆ పాయింట్‌ని పట్టుకుంది ఇనయా. ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను లేనప్పుడు నా గురించి వేరేవాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ అర్థం పర్థం లేని రీజన్‌ చెప్పింది. నాకా డ్యూటీ అప్పగించింది నువ్వు కాదు.. కెప్టెన్, కాబట్టి అతనికే చెప్పాను అని అతను ఎంత చెబుతున్నా వినదే! ఏదేదో మాట్లాడుతూ అరవసాగింది. దాంతో అతను ఏయ్‌ అర్థం కావట్లేదా అనేసరికి మరింత రెచ్చిపోయింది. గొడవాడటానికి ఏ కారణం దొరుకుతుందా అని చూసే ఇనయా మళ్లీ బైటికొచ్చి రచ్చ రచ్చ చేసింది. 

రేవంత్ నిద్ర.. పడింది ముద్ర

పాపం రేవంత్. కెప్టెన్‌గా అదరగొట్టేశాడు. కానీ రెండుసార్లు నిద్రపోయి కెమెరాలకు దొరికిపోయాడు. బేసిగ్గా అతనిలోని తప్పులు వెతికి వెతికి నామినేట్ చేస్తుంటారు హౌస్‌మేట్స్. అలాంటిది ఈ సారి అతనే తప్పు చేసి చాన్స్ ఇచ్చాడు. ఇంకేముంది.. అదే పట్టుకున్నారు. అతను నాగార్జున దగ్గరే జరిగినదానికి సారీ చెప్పేశాడు. ఆయన కూడా అద్భుతంగా ఆడావంటూ మెచ్చుకున్నారు. ఆ చిన్న తప్పుని క్షమించేశారు. వీళ్లు మాత్రం వదల్లేదు. ఈజీగా ఓ రీజన్ దొరికింది కదా అని రేవంత్‌ పేరు టకటకా చెప్పేశారు. ఒకళ్లిద్దరు ఆ రీజన్‌తో నామినేట్ చేశాక కూడా సారీ చెప్పాడు రేవంత్. అలా చేయడం తప్పే, ఇంకోసారి చేయను అని కూడా అన్నాడు. అయినా వదలకుండా మిగతావాళ్లు కూడా అదే కారణంతో నామినేట్ చేయడం ఫూలిష్‌గా అనిపిస్తోంది. అతను అన్నట్టు నిజంగా ఏ కారణం లేక, ఎవరూ దొరక్కే అతనిని నామినేట్ చేస్తున్నారని అర్థమైపోతోంది. అసలు సూర్యతో రొమాన్స్ చేయడం తప్ప వారమంతా ఆటే ఆడని ఇనయాని ఎవరూ నామినేట్ చేయలేదు. టాస్కుల్ని కూడా అర్థం చేసుకోలేక అస్తమానం బోల్తా పడే రాజ్‌ జోలికీ వెళ్లలేదు. అంటే నామినేట్ చేయడానికి తప్పులే చేయాలా? అసలు ఆటే ఆడకపోయినా పర్లేదా? వాళ్లు ఇంట్లో ఉండటానికి అర్హులేనా?

వాసంతి కాన్ఫిడెన్స్.. ఫైమా ఓవర్ కాన్ఫిడెన్స్

నామినేషన్ల టైమ్‌లో అత్యంత సిల్లీ రీజన్స్ చెప్పడంలో ఫైమా తర్వాతే ఎవరైనా. ఈసారి కూడా అదే చేసింది. నువ్వసలు గేమ్‌లో కనిపించనే లేదు అంటూ వాసంతిని టార్గెట్ చేసింది. ఈ ఒక్క వారమే కాదంట.. అసలు ఇన్ని వారాల్లో ఒక్కసారి కూడా ఆమె కనిపించలేదంట. అద్భుతంగా ఎంటర్‌‌టైన్ చేశావంటూ పోయిన వారం నాగార్జున మెచ్చుకుంటున్నప్పుడు ఈ ఫైమా నిద్రపోతోందో ఏమో. నీకంటే నేనెక్కడ తక్కువ ఆడాను అని వాసంతి అడుగుతుంటే, నువ్వు అసలు ఆడితే కదా చెప్పడానికి అంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ని ప్రదర్శించింది. ఇప్పుడే కాదు.. ఆమె ఎప్పుడూ ఇంతే. నువ్వు ఆటలో కనిపించడం లేదు అంటూ ఎవరో ఒకరిని నామినేట్ చేస్తూనే ఉంటుంది. పైగా తాను చెప్పేది చాలా కరెక్ట్ అన్నట్టు వెటకారంగా మాట్లాడుతుంది. ఈమె మాటలే హర్టింగ్‌గా ఉన్నాయి అంటే వాసంతిని ఆదిరెడ్డి, రాజ్ కూడా చాలా బాధపెట్టారు. ఆదిరెడ్డి ఆమెని డిజర్వింగ్ క్యాండిడేట్‌వి కాదన్నాడు. నువ్వు నామినేషన్‌కి భయపడ్డావ్, అందుకే సెల్ఫ్ నామినేట్ చేసుకోలేదు అంటూ రాజ్‌ కూడా తనని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. వాసంతికి చాలా బాధ కలిగింది. కానీ ఎక్కడా తగ్గలేదు. కాన్ఫిడెంట్‌గా అందరికీ సమాధానం చెప్పింది. ఆమె కాన్ఫిడెన్స్ కనుక లూజ్ అవ్వకుండా ఉంటే కచ్చితంగా బాగా ఆడుతుంది. ఆ విషయం నాగ్‌ కూడా ఆల్రెడీ చెప్పారు. 

మొత్తానికి ఈవారం గరమ్ గరమ్‌గానే సాగింది. స్టార్టింగ్‌లో గీతూ కాస్త కామెడీ చేసింది. ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరూ నాకు లైన్ వేయలేదంది. అందరూ భయపడి దూరంగా పోతారు, అక్కా అని పిలుస్తారు, నేను అందంగా లేనా అంది. దాంతో ఆదిరెడ్డి కంపని తెచ్చి అతికించుకోవడం ఎందుకులే అనుకుని ఉంటారంటూ సెటైర్ వేశాడు. అందంగా లేక కాదు, నీతో పెట్టుకుంటే మందంగా అయిపోతారని అంటూ రేవంత్ కూడా ఉడికించాడు. అలా నవ్వులతో మొదలై నిప్పు రవ్వలతో ముగిసింది ఎపిసోడ్. ఈ మంట రేపు కూడా మండుతుందా లేక ఇవాళ్టితోనే ఆరిపోతుందా అనేది చూడాలి.