
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ వచ్చే నెలలో జరిగే సీజన్ ఓపెనింగ్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హైదరాబాద్ నుంచి సీనియర్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కింది. 22 ఏండ్ల తిలక్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. హాంప్‌షైర్ టీమ్ తరపున బరిలోకి దిగిన హైదరాబాదీ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 100, 56, 47, 112 స్కోర్లతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
రంజీ ట్రోఫీ ఫైనల్ వరకు సూపర్ పెర్ఫామెన్స్ చేసిన కేరళ ఆటగాళ్లకు సౌత్ జోన్ టీమ్‌లో ప్లేస్ లభించింది. మొత్తం16 మంది ఆటగాళ్లలో కేరళ నుంచి నలుగురు ఎంపికయ్యారు. మహ్మద్ అజరుద్దీన్ వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు. కాగా, ఈ ఏడాది దులీప్ ట్రోఫీ ఆరు జట్ల మధ్య తిరిగి జోనల్ ఫార్మాట్‌లో జరగనుంది. గతేడాది ఇండియా ఎ, బి,సి,డి జట్ల మధ్య జరిగిన టోర్నీకి ఇది భిన్నంగా ఉంటుంది.
గతంలో ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేయగా.. ఇప్పుడు జట్లను సంబంధిత జోన్ సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్స్‌లో జరగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఈస్ట్ జోన్‌తో నార్త్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడనున్నాయి. సౌత్ జోన్, వెస్ట్ జోన్‌లకు నేరుగా సెమీఫైనల్ ఎంట్రీ లభించింది.
సౌత్ జోన్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), మహ్మద్ అజరుద్దీన్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, టి. విజయ్, ఆర్ సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్‌కుమార్, నిధీష్, రిక్కీ భుయ్, బసిల్ ఎన్‌పీ, గుర్‌జప్‌నీత్, స్నేహాల్ కౌతాంకర్. స్టాండ్ బై: మోహిత్ రెడ్కర్, ఆర్. స్మరణ్, అంకిత్ శర్మ, ఎదెన్ టామ్, ఆండ్రీ సిద్ధార్థ్, షేక్ రషీద్.