లిమిటెడ్‌‌ స్థానాల్లోనే టీడీపీ పోటీ.. లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు

లిమిటెడ్‌‌ స్థానాల్లోనే టీడీపీ పోటీ.. లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు
  • చంద్రబాబుతో ములాఖత్​లో నిర్ణయం 
  • పోటీచేసే స్థానాలపై ఇయ్యాల చర్చ 
  • 15 నుంచి 20 స్థానాల్లో బరిలోకి దిగే చాన్స్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ములాఖత్‌‌‌‌ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చినట్లు తెలిసింది. కనీసం 15 నుంచి 20 స్థానాల్లో టీడీపీ పోటీ చేయడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. అలాగే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు అప్పగించారు. ఆయన నేతృత్వంలో టీడీపీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు.
  
నేడు ఎన్నికల కమిటీ భేటీ..

టీడీపీ నేతలు ఆదివారం ఎన్టీఆర్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ భవన్‌‌‌‌లో సమావేశమై పార్టీ పోటీ చేసే స్థానాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌, బక్కని నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి, చిలివేరు కాశీనాత్​తో పాటు పలువురు సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో సమావేశమై అభ్యర్థుల లిస్ట్​ను సిద్ధం చేయనున్నారు. 

ప్రధాన పార్టీల్లో టికెట్‌‌‌‌ రాని వారిపై గురి..

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌, బీజేపీలో సీట్లు రాని అసంతృప్త నేతలకు టీడీపీ టికెట్‌‌‌‌ ఇచ్చే అవకాశాలు పరిశీలించనున్నారు. లోకేష్‌‌‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌‌‌‌ రంగంలోకి దిగి అసంతృప్తులకు టీకెట్‌‌‌‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

అన్ని ఒకే సామాజిక వర్గానికి వద్దు..

పార్టీ పోటీ చేసే అభ్యర్థుల్లో గంపగుత్తగా ఒకే సామాజిక వర్గానికి సీట్లు కేటాయించవద్దని పార్టీ అధినేత సూచించినట్లు తెలిసింది. గతంలో రూపొందించిన 30 మంది లిస్ట్‌‌‌‌లో 14 మంది పేర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించిన వాళ్లే ఎక్కువ మందికి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందనే విమర్శలు రాకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో కాసాని కుటుంబంలో ఇద్దరికి మాత్రమే టికెట్‌‌‌‌ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.