తెలంగాణం రాష్ట్రంలో తెలుగు ప్రాధాన్యం పెంచాలి : తెలుగు భాష చైతన్య సమితి డిమాండ్

తెలంగాణం రాష్ట్రంలో తెలుగు ప్రాధాన్యం పెంచాలి : తెలుగు భాష చైతన్య సమితి డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెలుగు భాష ప్రాధాన్యాన్ని పెంచాలని, అన్ని బోర్డులు తెలుగును కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగు భాష చైతన్య సమితి డిమాండ్ చేసింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి​చేయాలని కోరింది. గురువారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో తెలుగు భాష చైతన్య సమితి 12వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, రచయిత నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, ప్రొఫెసర్ కాసిం హాజరై మాట్లాడారు. ఏ భాష నేర్చుకున్నా తెలుగును మరవకూడదని సూచించారు. తెలుగు కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో తెలుగు ప్రధాన అంశంగా ఉంచాలని సూచించారు. బడే సాబ్, రామకృష్ణ, చంద్రమౌళి, డాక్టర్ జయప్రకాశ్, మల్లయ్య, నాలేశ్వరం శంకరం, బాలాచారి, జయ రాములు, మల్లికార్జున్, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.