కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ హఠాన్మరణం

V6 Velugu Posted on Apr 26, 2021

హైదరాబాద్: కరోనాతో దర్శకుడు సాయి బాలాజీ కన్నుమూశారు. కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలైంది. అనారోగ్యంతో పొట్టి వీరయ్య మృతి చెందిన కొన్ని గంటల వ్యధిలోనే సాయి బాలాజీ హఠాన్మరణం చెందడం తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా రంగంలో మూడున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం తెల్లవారుఝామున 5.10 గంటలకు హైదరాబాద్ లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సినీ రంగంలో సాయిబాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్. చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం ఆయన స్వస్థలం. హీరో శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’, అలాగే ఉదయకిరణ్ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్’లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు. హీరో చిరంజీవి నటించిన ‘బావ గారూ బాగున్నారా!’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సాయిబాలాజీవే! అలాగే, ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ లాంటి పలు టీవీ సీరియల్స్ కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. 

తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడే సినీరంగానికి వచ్చిన సాయిబాలాజీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారు. మోహన్ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’ తదితర అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు. రచయిత ఎమ్మెస్ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు నటుడిగా తీసుకురావడంలో సాయిబాలాజీ కీలకపాత్ర వహించారు. చాలాకాలం పాటు నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు. ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్ రాజ్ తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సినిమా, స్క్రిప్టులపై సాయిబాలాజీ నిష్కర్షగా వ్యక్తం చేసే అభిప్రాయాలను పలువురు దర్శక, నిర్మాతలు గౌరవించేవారు. 
 

Tagged , corona effect tollywood, director sai balaji, telugu movies director saibalaji, tollywood corona deaths, screenplay writer, script writer saibalaji

Latest Videos

Subscribe Now

More News