దేశ రాజకీయాల్లో తెలుగువాళ్లు కీలకంగా మారాలి

దేశ రాజకీయాల్లో తెలుగువాళ్లు కీలకంగా మారాలి
  •      ఢిల్లీలో మన పాత్ర తగ్గడానికి కారణమేందో ఆలోచించాలి.. 
  • రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాలి
  •     ‘గవర్నర్​పేట్​ టు గవర్నర్స్​ హౌస్’​ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

హైదరాబాద్​, వెలుగు: దేశ రాజకీయాల్లో తెలుగువాళ్లు కీలకంగా మారాలని సీఎం రేవంత్​రెడ్డి ఆకాంక్షించారు. ‘‘ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఇది మన మనుగడకు, తెలుగు జాతి గుర్తింపునకు మంచి పరిణామం కాదు. మనమంతా కలిసి ప్రయాణం మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది” అని సీఎం అన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో తెలుగు వాళ్లు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీ.ఎస్.రామ్​మోహన్​ రావు రచించిన ‘గవర్నర్​పేట్​  టు గవర్నర్స్​ హౌస్’​ పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఎంసీహెచ్​ఆర్​డీలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగువాళ్ల ప్రభావం జాతీయ రాజకీయాల్లో కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నదని, దీన్ని మనందరం నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు లాంటి నాయకులు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. 

వారి తరం తర్వాత.. మళ్లీ జాతీయస్థాయిలో వెంకయ్యనాయుడు, జైపాల్​రెడ్డి లాంటి వారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు” అని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర సమస్యలను జాతీయస్థాయిలో ప్రస్తావించడానికి, పార్లమెంట్​లో చర్చించడానికి ఢిల్లీలో తెలుగు నాయకులు పెద్దగా కనిపించడం లేదని అన్నారు. ఫుల్​టైమ్​ బిజినెస్​ చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావడం, ఫుల్ టైమ్​ రాజకీయ నాయకులు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నదని పేర్కొన్నారు. 

  • మంచి సంప్రదాయాన్ని పాటించాలి

గతంలో నంద్యాల నుంచి పీవీ నరసింహారావు పోటీ చేస్తే.. తెలుగువాడు ప్రధానిగా ఉండాలని పీవీపై ఎన్టీఆర్  తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఇలాంటి మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్నే పాటిస్తున్నదని చెప్పారు. 

తెలుగు వారు రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తెలుగువారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్లను గౌరవించామని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను అనుభవజ్ఞులు ప్రస్తావించాలని ఆయన కోరారు. 

ఈ బుక్..​ పొలిటికల్​ సస్పెన్స్​ థ్రిల్లర్​ అవుతుంది 

పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నవాళ్ల స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణం వరకు  76 ఏండ్ల చరిత్ర పరిణామక్రమాలు తెలిసినవాళ్లని,  ఇలాంటి అనుభజ్ఞులను కలుసుకోవడం గొప్ప అనుభూతి అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసులు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. తమిళనాడు మాజీ గవర్నర్​, మాజీ డీజీపీ పీఎస్​ రామ్​మోహన్ రావు భాష మీద మంచి పట్టున్న వ్యక్తి అని, ఆయన  రచించిన ‘గవర్నర్​పేట్​  టు గవర్నర్స్​ హౌస్’ పుస్తకం పొలిటికల్​ సస్పెన్స్​ థ్రిల్లర్​ అవుతుందని సీఎం అన్నారు. పోలీసు అధికారిగా, గవర్నర్​ గా రామ్​మోహన్​రావు ఎన్నో సేవలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పీవీ రంగయ్యనాయుడు, డీజీపీ రవి గుప్త, అధికారులు, రాజకీయనాయకులు పాల్గొన్నారు. 

రాష్ట్రపతి నార్త్ ​వాళ్లయితే..  ప్రధాని సౌత్​ వాళ్లు అయ్యేది

కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్​ ఎకానమీ అని చెప్తున్నదని, అందులో మన పాత్ర ఏమిటనేది మనమందరం కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడేది తెలుగేనని, జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో తెలుగువాళ్లు ఉండాలని అన్నారు. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారత వ్యక్తికి ఇస్తే, ప్రధానమంత్రి పదవి దక్షిణాది వ్యక్తికి ఇచ్చేవాళ్లని.. ప్రధాని పదవి ఉత్తర భారత వ్యక్తికి ఇస్తే, రాష్ట్రపతి పదవి దక్షిణాది వ్యక్తికి ఇచ్చే సంప్రదాయం ఉండేదని..

 మిగతా ముఖ్యమైన పోర్ట్​ ఫోలియోల్లో కూడా ఈ సంప్రదాయం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వివరించారు. దీనికి కారణం ఏమిటో అనుభవజ్ఞులు సూచన చేయాలని ఆయన కోరారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయాలు చేసేటప్పుడు ఎలాంటి విచక్షణ ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై క్లారిటీ ఉండాలని అన్నారు. తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించాల్సిన, అభివృద్ధిని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇందుకు అందరి సహకారం ఉండాలని ఆయన కోరారు.