
రెండు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సీఎం క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మంత్రులు. నీటిపారుదలపై, పునర్విభజన చట్టాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు మంత్రి ఈటల. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఘర్షణ లేకుండా ఇచ్చిపుచ్చుకునే దోరణి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీలు గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఎదగాలని ఈటల కోరుకున్నారు ఈటల.
షెడ్యూల్ 9,10 లోని అంశాలను పరిష్కరించే దిశగా చర్చించామని చెప్పారు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నదీ జలాలను రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో నీటి సమస్య వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గోదావరి నది జలాలను వాడుకోవడం కోసం ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇవ్వాలని.. జులై 15 తేదీ కటాఫ్ గా పెట్టామన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయమని, సమస్యలు పరిష్కరించుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి.