బిగ్ బాస్ రివ్యూ: ఔరా.. ఇనయా కొత్త పులిహోర!

బిగ్ బాస్ రివ్యూ:  ఔరా.. ఇనయా కొత్త పులిహోర!

బొమ్మలు, పూలను సేకరించే గేమ్‌లో నిన్న హౌస్‌మేట్స్ రచ్చ రచ్చ చేశారు. అరుపులు, కేకలతో ఇల్లంతా అదరగొట్టారు. ఆ గేమ్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. మరి వాళ్ల రభస కూడా కంటిన్యూ అయ్యిందా? చివరికి ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు?

గెలుపు వాళ్లదే!

నిన్నటి గేమ్‌ని ఇవాళ పూర్తి చేశారు హౌస్‌మేట్స్. ఆ క్రమంలో ఆటతో పాటు హంగామా కూడా కంటిన్యూ అయ్యింది. పోటీపడి బొమ్మలు, పూలు లాక్కున్నారు. ఎలాగైనా గెలవాలని చాలా ఆరాటపడ్డారు. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించారు. వాళ్లు చేసేది కరెక్ట్ కాదంటూ గుంపులు గుంపులుగా డిస్కషన్లూ పెట్టారు. ఎట్టకేలకి బ్లూ టీమ్‌ రెండు రౌండ్లు గెలిచి విజేతగా నిలిచింది. రెడ్ టీమ్‌ ఓటమికి తల వంచింది. ఆ తర్వాత కూడా పర్‌‌ఫార్మెన్సెస్ గురించి రకరకాలుగా డిస్కషన్ నడిచింది. మెరీనా సరిగ్గా ఆడలేదని, కావాలని గొడవేసుకుందని రేవంత్ అన్నాడు. మెరీనా, రోహిత్ కూడా ఒకరితో ఒకరు చాలా విషయాలు చెప్పుకున్నారు. అంతలో బిగ్‌బాస్‌ ఎంటరయ్యాడు. ఓడిపోయిన టీమ్‌ నుంచి ఒకరు తర్వాతి వారానికి నేరుగా నామినేట్ అవ్వాలనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్లాక్ గ్లవ్ గురించిన టాపిక్ రావడంతో బిగ్‌బాస్ మళ్లీ సీన్‌లోకి వచ్చాడు. ఆ గ్లవ్ చివరిగా ఎవరి చేతిలో ఉంది అని అడిగితే శ్రీసత్య పేరు చెప్పారంతా. దాంతో ఆ గ్లవ్‌ నీ దగ్గర ఉంది కాబట్టి గెల్చిన టీమ్‌ నుంచి ఒకరితో నీ ప్లేస్‌ని స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. అయితే ఆ గ్లవ్‌ను లెక్కించకుండా తప్పు చేయడంతో ఆ పవర్‌‌ కోల్పోయావు, కాబట్టి స్టోర్ రూమ్‌లో పెట్టెయ్యి అని శ్రీసత్యతో చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. 

తప్పులు ఒప్పుకోరుగా!

ఓడిపోయిన టీమ్‌ నుంచి ఒకరు నామినేట్ అవ్వాలి అని బిగ్‌బాస్ చెప్పాక నేను అవ్వనా అని మొదట శ్రీసత్య అంది. పోనీ నేను అవ్వనా అని తర్వాత గీతూ అంది. అయినా కూడా ఎందుకైనా మంచిదని చీట్ల మీద పేర్లు రాసి ఫైమాని తీయమన్నారు. శ్రీసత్య పేరు వచ్చింది. అంతే.. ఆమె వెంటనే మాట మార్చేసింది. మొదట నేనెళ్తా నేనెళ్తా అన్న ఆమె, తన పేరున్న చిట్‌ రావడంతో కొత్త కథ మొదలెట్టింది. నేనే అవుదామనుకున్నాను, కానీ నైటంతా ఆలోచించాక డిస్కస్ చేస్తే బెటరని డిసైడయ్యాను, మీరందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ తెలివిని ప్రదర్శించింది. దాంతో ఓటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు సత్య అర్జున్‌ పేరు చెప్పింది. ఆ తర్వాత అర్జున్ కూడా సత్య పేరు చెప్పాడు. దాంతో సేఫ్ ఆడొద్దంటూ గీతూ క్లాస్ పీకింది. హాసిని పాత్రను సరిగ్గా చేయలేదంటూ వాసంతిని గీతూ నామినేట్ చేసింది. సూర్య కూడా ఆమె పేరే చెప్పాడు. మిగతావాళ్లు కూడా తమ తమ అభిప్రాయాలు చెబుతూ ఓటింగ్ వేశారు. అయితే అందరూ ఎదుటివాళ్ల తప్పుల్ని ఎత్తి చూపించారే తప్ప అవతలివారు తమ పేరు చెప్పినప్పుడు మాత్రం ఒప్పుకోలేకపోయారు. నేను బాగా ఆడాను, నీకే అలా అనిపించింది, నీకు నా గేమ్ అర్థం కాలేదు అంటూ ప్రతి ఒక్కళ్లూ తెగ సమర్థించుకున్నారు. 

అందరి టార్గెట్ ఆమే!

హౌస్‌లో ప్రతి ఒక్కరూ తనని తప్పుబడుతుంటే వాసంతి తట్టుకోలేకపోయింది. అలా అని తగ్గిపోలేదు. ఏడుస్తూ కూర్చుండిపోలేదు. తన గురించి తాను గట్టిగా స్టాండ్ తీసుకుంది. సెల్ఫ్ నామినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అందరూ వాసంతినే టార్గెట్ చేశారు. చాలాసేపు అదంతా భరించిన ఆమె.. రాజ్‌ తన పేరు చెప్పినప్పుడు మాత్రం ఇక ఆపుకోలేకపోయింది. సినిమాల్లోని పాత్రల విషయంలో బిగ్‌బాస్ అందరికీ శిక్ష వేసేశాడు, మళ్లీ ఆ టాపిక్‌ ఎందుకు అని అడిగింది. ఇంట్లో ఉండటానికి అర్హత ఉందని ప్రూవ్ చేసుకోడానికి ఆడిన టాస్కుల్లో ఎలా ఉన్నాం అనేదాని మీద ఓట్ చేస్తే బాగుంటుంది అని చెప్పింది. అది కచ్చితంగా కరెక్ట్ పాయింటే. ఎందుకంటే ఆ టాస్క్ అప్పటితో అయిపోయింది. దాని విషయంలో బిగ్‌బాస్ తీవ్రంగా కోప్పడ్డాడు. వాళ్లని నానా హింసలూ పెట్టి ఎప్పటికో నార్మల్ అయ్యాడు. సరిగ్గా ఆడలేదని ఆయనే చెప్పాక మళ్లీ దానిని వంకగా చూపెట్టి నామినేట్ అవ్వమనడం ఏంటి! నేను ఆట బాగా ఆడాను అని శ్రీసత్య చెబుతోందే కానీ ఆమె పెద్దగా ఆడిందేమీ లేదు. టీమ్ లీడర్‌‌గా కూడా ఆమె ఏమీ చేయలేదు. ఇక గీతూయేమో ఆటంటే ఫిజికల్‌గానే ఆడాలా, మైండ్‌తో ఆడాను అంటోంది. అక్కడ అందరూ చెమటలు కక్కుతూ, చేతులూ కాళ్లూ తొక్కుకుంటూ బొమ్మలు, పువ్వులు సంపాదిస్తుంటే ఈమె కామెడీ చేసి వాళ్లని అడ్డుకోడానికి ట్రై చేసిందట. అదీ గేమే అంటోంది. వీళ్ల అతి తెలివైన లాజిక్కుల ముందు నిలబడలేక చివరికి తానే నామినేట్ అవ్వడానికి రెడీ అయిపోయింది. 

వాసంతిని వదల్లా!

నామినేట్ అవ్వాల్సింది వాసంతియే అని అందరూ తేల్చారు. ఆమె నామినేట్ అయిపోయింది. అయినా తనని వదల్లేదు. ఈ వారం మొత్తంలో ఎవరు డిజాస్టర్‌‌ ప్లేయరో సెలెక్ట్ చేయమని బిగ్‌బాస్ చెప్పడంతో మరోసారి అందరూ ఆమె వెంట పడ్డారు. అగ్రెసివ్ అయ్యావంటూ అర్జున్ రేవంత్‌ని డిజాస్టర్ అన్నాడు. రూల్స్ ఫాలో అవలేదని శ్రీసత్య రేవంత్‌ని.. ఆడాల్సినంత ఆడలేదని వాసంతి, మెరీనాలు గీతూని డిజాస్టర్‌‌గా ఎంచారు. ఇంకొంచెం బెటర్ ఆడాల్సిందంటూ రాజ్, తనని ఆటలో తప్పుగా అర్థం చేసుకున్నందుకు శ్రీహాన్ మెరీనా పేరు చెప్పారు. స్మార్ట్ గేమ్ ఆడలేదంటూ మెరీనాని ఫైమా సెలెక్ట్ చేసింది. ఇక మిగతా వాళ్లందరూ వాసంతినే టార్గెట్ చేశారు. వాంటెడ్‌గా ఫిజికల్‌ అవ్వడం కరెక్ట్ కాదంటూ సూర్య, తన కాన్వర్సేషన్ నచ్చలేదంటూ గీతూ, రూల్స్ అతిక్రమించావంటూ రేవంత్, వద్దన్నా చేయి పెట్టి బొమ్మలు లాగడం, రేవంత్‌ని కొట్టడం తప్పు అంటూ ఆదిరెడ్డి వాసంతిని తప్పుబట్టారు. అందరి కంటే ఎక్కువ ఓట్లు పడటంతో వాసంతి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఔరా.. ఇనయా కొత్త పులిహోర!

మొన్నటి వరకు సూర్య మీదే దృష్టి పెట్టి ఆటను పక్కన పెట్టేసిన ఇనయా.. ఎందుకో తెలీదు కానీ ఇప్పుడు శ్రీహాన్‌ ఆటని చెడగొట్టే పనిలో పడింది. ప్రతిదానికీ శ్రీహాన్ శ్రీహాన్ అంటోంది. నిన్నటి ఎపిసోడ్‌లో అతని పుట్టినరోజుని అడ్డుపెట్టుకుని చాలా చేసింది. ఇవాళ మరోసారి అర్జున్‌ తనకి స్పెషల్ అన్నట్టు చెప్పడానికి ట్రై చేసింది.  డ్యాజ్లర్‌‌ వాళ్లు అమ్మాయిలందరికీ నెయిల్ పాలిష్ చాలెంజ్‌ పెట్టారు. ఒక్కో అమ్మాయీ ఒక్కో అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్లతో నెయిల్ పాలిష్ వేయించుకోవాలి. బెస్ట్గా నిలిచిన జంటకి గిఫ్ట్స్ ఉంటాయి. ఇదంతా ఇనయానే చదివింది. అయితే ప్రతి అమ్మాయీ ఒకబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్ చదవగానే నేను శ్రీహాన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాకు శ్రీహాన్‌ పాలిష్ వేయాలి అని చెప్పేసింది. అప్పుడామెలో చాలా ఎక్సయిట్‌మెంట్ కనిపించింది. అతని విషయంలో ఆమె నిజంగా అలా ఫీలవుతుందా లేక సూర్య తనూ విడిపోయినట్టు ఇంట్లోవాళ్ల దగ్గర బిల్డప్ ఇద్దామనుకున్నారు కాబట్టి వాళ్లని నమ్మించడానికి ఇలా చేస్తుందా అనేది తెలియడం లేదు. అయితే ఇలా మాటిమాటికీ పులిహోర కలుపుతూ పోతుంటే ఇవన్నీ బైటికి నెగిటివ్‌గా వెళ్లే చాన్సెసే ఎక్కువ. ఇది కాస్త శ్రుతి మించితే శ్రీహాన్‌కి కూడా నెగిటివ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. 

మొత్తానికి ఇంటి నిండా నెగిటివ్ వైబ్రేషన్సే. అందరూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం, ఎవరికి వారు గొప్ప అని ఫీలయ్యి ఎదుటివారిని తీసి పారేయడం చేస్తున్నారు. చివరి వరకు ఎవరు నిలబడతారో, ఎవరు మధ్యలోనే వెనుదిరుగుతారో ఎవరికీ తెలియదు. ఎవరికి వారు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు ఓవర్ కాన్ఫిడెంట్‌ కూడా అవుతున్నారు. మరి వీళ్లలో ఎవరికెప్పుడు ఏ షాక్ తగులుతుందో, ఎవరి ఆట ఎలాంటి మలుపు తిరుగుతుందో ముందు ముందు చూడాలి.