
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు వద్ద బ్యాటింగ్ చేసిన ఈ సఫారీ కెప్టెన్ నాలుగో రోజు 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్ కు దిగి ఓవర్ నైట్ స్కోర్ కు ఒక్క పరుగు మాత్రమే జోడించాడు. కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 59 ఓవర్ చివరి బంతిని బవుమా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో జట్టు స్కోర్ 217 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.
బవుమా ఔటై పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ప్రోటీస్ కెప్టెన్ ఆటకు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభంలో హామ్ స్ట్రింగ్‌తో ఇబ్బంది పడినా జట్టు కోసం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. చికిత్స అందించినప్పటికీ.. పరుగెత్తడం కష్టంగా ఉన్నప్పటికీ బవుమా పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. మార్కరంతో కలిసి బవుమా మూడో వికెట్ కు 147 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సఫారీలు ప్రస్తుతం 71 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాటర్ బవుమా (66), స్టబ్స్ (8) ఔటయ్యారు. క్రీజ్ లో మార్కరం (120) ఉన్నాడు. సౌతాఫ్రికా గెలుపుకు మరో 40 పరుగులు అవసరం. మరోవైపు ఆస్ట్రేలియా గెలవాలంటే 6 వికెట్లు తీయాల్సి ఉంది.
Standing applause for LORD BAVUMA after scoring 66(134) 👏👏 in WTC final pic.twitter.com/2e7gWcUtIU
— Forever_ICT (@loyal_cskian) June 14, 2025