ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రికార్డవుతున్న టెంపరేచర్​ కన్నా ఎక్కువ వేడి

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రికార్డవుతున్న టెంపరేచర్​ కన్నా ఎక్కువ వేడి

హైదరాబాద్​, వెలుగు: ఎండ చూడ్డానికి మామూలుగానే ఉంటున్నది.. రికార్డయ్యే టెంపరేచర్లూ తక్కువగానే ఉంటున్నాయి.. కానీ, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నప్పటికీ వేడి తీవ్రత మాత్రం ఓ రేంజ్​లో ఉంటున్నది. ఈ పరిస్థితిని ‘ఫీల్​ లైక్​ టెంపరేచర్’​ అని పిలుస్తారు. అంటే నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా.. వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా తక్కువగా ఉండటమన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం హ్యుమిడిటీనే! గాలిలోని తేమ శాతాన్ని బట్టి ఈ ఫీల్​లైక్​ టెంపరేచర్లు మారుతుంటాయి. అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఇది చేంజ్​ అవుతుంది. 

మన దగ్గర మాత్రం ఏడాదిన్నరకాలంగా ఫీల్​ లైక్​ టెంపరేచర్​ ప్రభావం పెరిగిపోతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టే.. ఆ టెంపరేచర్ల కన్నా ఎక్కువ వేడి తీవ్రత నమోదవుతున్నది. దానికి ప్రధాన కారణం గాలిలో తేమ (హ్యుమిడిటీ) పెరుగుతుండటమే. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. వేడి తీవ్రత మాత్రం అంతకు రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగానే ఉంటున్న భావన కలుగుతున్నది. అంటే రికార్డెడ్​ టెంపరేచర్ 40 డిగ్రీలే అయినా.. 43 డిగ్రీల మేర రికార్డయిన ఫీలింగ్​ కలుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉన్నది. చాలా చోట్ల వంద శాతం హ్యుమిడిటీ రికార్డ్​ అవుతున్నది. ఆ ప్రభావంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 

హ్యుమిడిటీ, ఫీల్​లైక్​ టెంపరేచర్​కు ఏంటి సంబంధం?

వాతావరణంలో ఎంతో కొంత తేమ ఉండటం సహజం. అయితే, అది ఉండాల్సినంత వరకు ఉంటే సమస్యేమీ లేదు. సాధారణ హ్యుమిడిటీ రేంజ్​ ఇంట్లో అయితే 30 నుంచి 40, ఆరుబయట అయితే 70 శాతంలోపు ఉండాలి. ఆ రేంజ్​ దాటిపోతే వేడి ఎక్కువవుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం కార్బన్​ డై ఆక్సైడ్​. ఈ కార్బన్​ డై ఆక్సైడ్​ పైకి వెళ్లి వాతావరణంలో కలిసిపోయేంత వరకు ఇబ్బంది లేదు. కానీ, అది ఇక్కడే ట్రాప్​ అయిపోతేనే సమస్యలు. ఇక్కడే కార్బన్​ డై ఆక్సైడ్​, హ్యుమిడిటీ మధ్య ప్రపోర్షనల్​ రిలేషన్​ ఉంటుంది. గాలిలో ఉండే తేమ.. కార్బన్​ డై ఆక్సైడ్​ను శోషించుకుని ఇక్కడే ట్రాప్​ చేస్తుంటుంది. అంటే వాతావరణంలో తేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కార్బన్​ డై ఆక్సైడ్​ పైకి వెళ్లిపోకుండా కిందే ట్రాప్​ అయిపోతుంది. ఇప్పుడు మన రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతున్నది. గత ఎండాకాలంలో హ్యుమిడిటీ తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు సమ్మర్​ ప్రారంభంలోనే మళ్లీ తీవ్రంగా నమోదవుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడులో ఆదివారం అత్యధికంగా హ్యుమిడిటీ వంద శాతం నమోదైంది.  నిజామాబాద్​, జగిత్యాల, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, వరంగల్​, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉక్కపోత 90 శాతానికిపైగానే రికార్డ్​ అయింది. ఫలితంగా కార్బన్​ డై ఆక్సైడ్​ హ్యుమిడిటీతో ట్రాప్​ అయ్యి వేడి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్నది. 

తగ్గనున్న టెంపరేచర్లు

రాష్ట్రంలో రెండు మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం 39.7 డిగ్రీల హయ్యెస్ట్​ టెంపరేచర్​ రికార్డ్​కాగా.. ఆదివారం కాస్తంత తగ్గుముఖం పట్టాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు ఒకట్రెండు డిగ్రీలు తగ్గాయి. మరో రెండు మూడు రోజుల వరకు టెంపరేచర్లు ఇలాగే నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ చిరుజల్లులూ కురిసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత మళ్లీ టెంపరేచర్లు క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 

ఫీల్​ లైక్​ టెంపరేచర్​ ఎప్పుడు వాడుకలోకి వచ్చింది?

ఈ ఫీల్​ లైక్​ టెంపరేచర్​ను 40 ఏండ్ల క్రితమే 1984లో ఆస్ట్రేలియాకు చెందిన వాతావరణ నిపుణుడు రాబర్ట్​ స్టెడ్​మెన్​ ప్రస్తావించారు. దానిని లెక్కించేందుకు ఓ ఈక్వేషన్ ను ఆయన రూపొందించారు. రికార్డయ్యే టెంపరేచర్​కు హ్యుమిడిటీతో పాటు గాలి వేగాన్ని పరిగణనలోకి తీసుకుని ఫీల్​ లైక్​ టెంపరేచర్​కు ఓ సమీకరణాన్ని రూపొందించారు. అయితే, ఈ ఫీల్​ లైక్​ టెంపరేచర్​ కొన్నిసార్లు తక్కువగానూ నమోదయ్యే అవకాశాలుంటాయి. ఉదాహరణకు శీతల దేశాల్లో చలికాలంలో టెంపరేచర్లు పడిపోయి.. హ్యుమిడిటీ తగ్గినప్పుడు అక్కడ రికార్డ్​ అయిన టెంపరేచర్ల కన్నా మరింత శీతల పరిస్థితులున్నట్టుగానూ అనిపిస్తుంది. అంటే కాలం, హ్యుమిడిటీలో తేడాలను బట్టి ఈ ఫీల్​ లైక్​ టెంపరేచర్​ తగ్గడమో, పెరగడమో జరుగుతుంది.