సరిహద్దు వివాదాలపై.. ఆగస్టు18న భారత్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

సరిహద్దు వివాదాలపై.. ఆగస్టు18న భారత్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

చైనా, భారత్ మధ్య స్నేహబంధం చిగురిస్తోందా.. ఇటీవల ట్రంప్ పన్నులతో విసిగిపోయిన భారత్ పొరుగు దేశం చైనాకు స్నేహహస్తం అందిస్తోంది.ఆగస్టులో చివరి వారంలో  ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు18) చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై చర్చించనున్నారు. 

సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ కు రానున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చర్చలు జరపనున్నారు. 2020 తర్వాత తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తలు పరిస్థితులను సాధారణస్థితికి తీసుకొచ్చే న్యూఢిల్లీ బీజింగ్ ప్రయత్నాల మధ్య ఈ పర్యటన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

చైనా రాయబారి పర్యటనను భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఆగస్టు 18 నుంచి 20 వరకు మూడు  రోజుల పాటు చైనా విదేశాంగ  మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటిస్తారని Xలో పోస్ట్ షేర్ చేసింది. భారత ఆహ్వానం మేరకు సరిహద్దు సమస్యపై చైనా,భారత్ ప్రత్యేక ప్రతినిధుల మధ్య 24వ రౌండ్ చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. 

►ALSO READ | చైనాని వెనక్కి నెట్టి.. స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇండియా ప్రపంచ అగ్రగామిగా ఎలా ఎదిగిందంటే..

2020 తర్వాత భారత్ చైనా సరిహద్దు ప్రాంతం లడ్డాఖ్ లో ప్రతిష్టంభన చోటు చేసుకుంది. ఇటీవలి నెలల్లో రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు చేపట్టాయి. గతేడాది లడ్డాఖ్‌లో ఘర్షణను తగ్గించేందుకు భారత్, చైనా పాక్షిక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కైలాష్-మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించింది. మరోవైపు భారతదేశం చైనా పర్యాటకులకు వీసాలు జారీ చేసింది. 

రెండు దేశాలలోని పరిశీలకులు వాంగ్ పర్యటనను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.