వామ్మో.. పెన్ గంగ బ్రిడ్జిపై నుంచి దూకుతోంది.. నదులు రోడ్లపైకి వచ్చినయ్.. వానలకు ఆదిలాబాద్ జిల్లా అల్లకల్లోలం !

వామ్మో.. పెన్ గంగ బ్రిడ్జిపై నుంచి దూకుతోంది.. నదులు రోడ్లపైకి వచ్చినయ్.. వానలకు ఆదిలాబాద్ జిల్లా అల్లకల్లోలం !

ఆదిలాబాద్ జిల్లా అల్లకల్లోలం అవుతోంది. జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో ఎటు చూసినా వరదలు ముంచెత్తున్నాయి. అక్కడ కురుస్తున్న వానలను అతి భారీ వర్షాలు అనటం కూడా తక్కువేమో.. అంత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం నుంచి కుండలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్లుగా వస్తున్న వానలకు జిల్లా మొత్తం జలదగ్బంధం అయ్యింది. 

భారీ వర్షాలకు కుంటాల జలపాతం మునుపెన్నడూ లేనంతగా ఉధృతంగా పరవళ్లు తొక్కుతోంది.  ఉప్పెన వచ్చిందా అన్నట్లు ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారటంతో అటవీ శాఖ అధికారులు పర్యాటకులను  అనుమతించడం లేదు. 

ఇక పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చి భయంకరంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనందపూర్ లో బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు బందయ్యాయి. బ్రిడ్జిపై నుంచి ప్రవహించేంత వరద వస్తుండటంతో సునామీ వచ్చిందా అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. పోలీసులు ఇరువైపు రాకపోకలు నిషేధించారు. 

నదులు, చెరువులైన రోడ్లు, కాలనీలు:

భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  కాలనిలు నీట మునిగాయి. పంజాబ్ చౌరస్తా చెరువును తలపిస్తోంది. రోడ్లపైన వరద నీరు గేట్లు ఎత్తిన నదిలా ప్రవహిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోడ్లన్నీ నదుల్లా కనిపిస్తుండటంతో వాహనదారులు రోడ్లెక్కడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందలకు గురవుతున్నారు. థియేటర్ లోకి భారీగా నడుము లోతు వరద నీరు చేరుకుంది. దీంతో ఏసియన్ కాంప్లెక్స్ ను సినిమాల ప్రదర్శన నిలిపేశారు. 

►ALSO READ | పోటెత్తిన వరద..కడెం ప్రాజెక్ట్ 18 గేట్లు ఓపెన్

గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల:

నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు లోకి వరద నీరు భారీగా పెరుగిపోతోంది. దీంతో ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70M కాగా.. ప్రస్తుత నీటిమట్టం 358.40M కు చేరుకుంది. ప్రాజెక్టులోకి 10 వేల500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.