
హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు మేడారంలో తాత్కాలికంగా 50 బెడ్ల హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. జాతరలో ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలపై అధికారులతో సోమవారం సెక్రటేరియెట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. మేడారంలో తాత్కాలికం గా ఒక స్పెషలిటీ హాస్పిటల్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు, జాతరకు పోయే రూట్లలో మరో 42 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని చెప్పారు. 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, 15 బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. మెడికల్ క్యాంపుల్లో ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక మరింత మెరుగైన వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్‌కు, వరంగల్ ఎంజీఎంకు పేషెంట్లను షిఫ్ట్ చేసి వైద్యం అందించాలని మంత్రి పేర్కొన్నారు.