- క్వార్టర్స్ షూటౌట్‌లో బ్రిటన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
- జట్టును గెలిపించిన గోల్ కీపర్ శ్రీజేష్
షూటర్లు మూడు పతకాలు తెచ్చిన తర్వాత మిగతా ఈవెంట్లలో ఫలితాలు నిరాశ కలిగిస్తున్న వేళ ఇండియా హాకీ టీమ్ అద్భుతం చేసింది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో వరల్ నం.2 గ్రేట్ బ్రిటన్ పని పట్టింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో రెండో క్వార్టర్‌లోనే రెడ్‌కార్డ్‌తో కీలకమైన అమిత్ దాస్ సేవలు కోల్పోయి పది మందితోనే ఆడినా.. ప్రత్యర్థి వరుస పెట్టి దాడులు చేసినా.. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత నైపుణ్యా లతో షూటౌట్‌లో బ్రిటన్‌పై ఇండియా పైచేయి సాధిం చింది. మరోవైపు బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ క్వార్టర్స్‌లోనే ఓడటంతో బాక్సింగ్‌లో మెడల్ లేకుండానే ఇండియా పోరు ముగిసింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో సెమీఫైనల్ చేరిన ఇండియా తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కిన సెన్సేషనల్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌లో విక్టర్ అక్సెల్సెన్ ముందు తలవంచాడు. లక్ష్య ఇప్పుడు కాంస్యం కోసం పోటీ పడనున్నాడు.
పారిస్ : తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడుతున్న లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ ప్రత్యర్థికి అడ్డుగోడగా నిలిచిన వేళ పారిస్ గేమ్స్‌లో ఇండియా మెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం అత్యంత హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా షూటౌట్‌లో 4–2తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించేందుకు చేరువైంది. ఈ ఉత్కంఠ పోరులో నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 1–1తో సమంగా నిలిచాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో ఇండియాకు తొలి గోల్ అందించాడు. టోర్నమెంట్‌లో అతనికిది ఏడో గోల్ కావడం విశేషం. లీ మోర్టన్ 27వ నిమిషంలో బ్రిటన్‌కు గోల్ అందించి స్కోరు సమం చేశాడు. షూటౌట్‌లో ఇండియా తరఫున కెప్టెన్ హర్మన్, సుఖ్‌జీత్, లలిత్ కుమార్, రాజ్‌కుమార్ గోల్స్ కొట్టగా... బ్రిటన్ రెండు గోల్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. మూడో ప్రయత్నంలో కోనర్ విలియమ్సన్ షాట్ మిస్సవగా... నాలుగో ప్రయత్నంలో ఫిలిప్ షాట్‌ను శ్రీజేష్ అడ్డుకొని జట్టును గెలిపించాడు. దాంతో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో ఇండియా సెమీస్ చేరింది. జర్మనీ–స్పెయిన్ మధ్య క్వార్టర్ ఫైనల్ విన్నర్‌తో ఇండియా మంగళవారం సెమీఫైనల్లో తలపడుతుంది.
పది మందితో ఆట.. ప్రత్యర్థికి అడ్డుగోడగా పీఆర్
టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్స్‌లోనూ ఇండియా, బ్రిటన్ తలపడగా.. ఈ పోరు దానికి రీ మ్యాచ్ మాదిరిగా సాగింది. అప్పటిలానే ఈసారి కూడా బ్రిటన్‌పైనే ఇండియా పైచేయి సాధించింది. గ్రూప్ దశలో ఏరియల్ పాస్‌తో ఫలితం రాబ్టటిన ఇండియాను బ్రిటన్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. వన్ టు వన్ మార్కింగ్‌తో ఇండియా ఏరియల్ పాస్‌లు ఆడకుండా అడ్డుకున్నారు. దాంతో మ్యాచ్ అసాంతం హర్మన్‌ప్రీత్ సేన ఇబ్బంది పడినా ఓటమి తప్పించుకోడానికి ప్రధాన కారణం కీపర్ శ్రీజేష్. నిర్ణీత సమయంతో పాటు షూటౌట్‌లోనూ ప్రత్యర్థికి అడ్డుగోడగా నిలిచిన అతను ఇండియాను సెమీస్ చేర్చాడు. ఆట ఆరంభం నుంచి ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఫస్ట్ క్వార్టర్‌లోనే ఎదురుదాడికి దిగాయి. దాంతో రెండు జట్ల కీపర్లకు పని పడగా.. తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా రాలేదు. రెండో క్వార్టర్‌లోనూ ఇదే జోరు నడవగా.. ఇండియా టాప్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ ప్రత్యర్థి ముఖానికి తగలడంతో వివాదాస్పద రీతిలో రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించడంతో ఆట కీలక మలుపు తీసుకుంది.
ఇండియా టీమ్‌లో ఓ ఆటగాడు తగ్గినప్పటికీ కాసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మ్యాజిక్ చేశాడు. 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌కు తన ట్రేడ్‌మార్క్ డ్రాగ్ ఫ్లిక్‌తో జట్టుకు గోల్ అందించి ఇండియాను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. కానీ, కొద్దిసేపటికే లీ మోర్టన్ కొట్టిన ఫీల్డ్ గోల్‌తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి బ్రిటన్ హవా మొదలైంది. పది మందితో కూడిన ఇండియాపై వరుసపెట్టి దాడులు చేసింది. కానీ, శ్రీజేష్ అడ్డును దాటకపోవడంతో ఇరు జట్లూ 1–1తో ఫస్టాఫ్‌ను ముగించాయి. ఇక, మూడో క్వార్టర్‌లో బ్రిటన్ ఆటగాళ్లు పూర్తిగా ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో పలు పెనాల్టీ కార్నర్లు అందుకున్నారు. కానీ, శ్రీజేష్ వారి ప్రయత్నాలను నిలువరించాడు. చివరి క్వార్టర్‌లోనూ బ్రిటన్ పలు అద్భుతమైన అవకాశాలను సృష్టించింది. కానీ, ఇండియా బలమైన డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైంది. బంతితో రెండుసార్లు ఇండియా డి బాక్స్‌లోకి దూసుకొచ్చిన బ్రిటన్ ప్లేయర్లను శ్రీజేష్ సమర్థవంతంగా నిలువరించాడు. మ్యాచ్‌లో బాల్ ఎక్కువ సమయం బ్రిటన్ చేతిలో ఉన్నప్పటికీ ఇండియా ఆటను షూటౌట్‌కు తీసుకెళ్లి
ఫలితం రాబట్టింది.
షూటౌట్ సాగిందిలా..
బ్రిటన్ స్కోరు ఇండియా
అల్బెరీ () 1-1 హర్మన్‌ప్రీత్ ()
జాచ్() 2-2 సుఖ్‌జీత్ ()
కోనర్(x) 2-3 లలిత్()
ఫిలిప్ (x) 2-4 రాజ్‌కుమార్ ()