తిర్యాణి, వెలుగు: అప్పుల బాధలతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్జిల్లాలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(52), పది ఎకరాల భూమి కౌలు తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. దిగుబడి రాకపోగా అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు.
వెంటనే గిన్నెదరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఏడాది కింద కూతురు పెండ్లి, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ. 5 లక్షల వరకు ఉన్నట్టు భార్య కౌసల్య విలపిస్తూ చెప్పింది. మృతుడికి ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
