బాల్క సుమన్ మా కుటుంబాన్ని మోసం చేసిండు.. : కౌలు రైతు

బాల్క సుమన్ మా కుటుంబాన్ని మోసం చేసిండు.. : కౌలు రైతు

వెలుగు, చెన్నూర్​: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం జెండావాడకు చెందిన కమ్మల రాజేశ్​ అనే కౌలు రైతు పది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. 2019 నుంచి 2021 వరకు మూడు సంవత్సరాలు  కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పత్తి చేను మునిగిపోయింది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకపోవడంతో అప్పుల పాలైన రాజేశ్​ 2021 సెప్టెంబర్ 23న పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి రైతు ఆత్మహత్యను పక్కదారి పట్టించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి గోదావరి ఒడ్డున రాజేశ్​ అంతక్రియలు నిర్వహించి, వీడియో రికార్డు చేసి సుమన్ కు పంపించారు. 

రాజేశ్​ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి మూడు రోజుల తర్వాత చెన్నూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వెళ్లారు. విషయం తెలుసుకున్న బాల్క సుమన్ అనుచరులు రాజేశ్​ తల్లిదండ్రులను, భార్యను బెదిరించి ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని వారితో చెప్పించారు. 

పంట నష్టపరిహారం, రూ.2 లక్షల ఎక్స్​గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మూడు నెలల తర్వాత బాల్క సుమన్​ వచ్చి రూ.2 లక్షలు రాజేశ్​ భార్యకు ఇచ్చి వెళ్లాడని, ఆ తర్వాత తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని తల్లిదండ్రులు కమ్ముల లక్ష్మి, రాములు, సోదరుడు కమ్ముల అంజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.