
- టెండర్ల ప్రక్రియ ప్రారంభం
- 765 చెరువుల్లో 2 కోట్ల 80 లక్షల
- చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక
కామారెడ్డి, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. కొన్ని చెరువులు మినహా దాదాపు అన్ని చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. చేప పిల్లల సరఫరాకు ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20న ప్రారంభమైన బిడ్ ప్రక్రియ సెప్టెంబర్ 1 మధ్యాహ్నం వరకు కొనసాగుతోంది. అదే రోజు కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లను తెరిచి పరిశీలిస్తారు. తక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీని ఖరారు చేయనున్నారు.
సెప్టెంబర్ రెండో వారం నుంచి చేప పిల్లల విడుదలకు అవకాశం ఉంది. ఈసారి మూడు రకాల చేప పిల్లలు వదలనున్నారు. ఏడాది అంతా నీరు నిల్వ ఉండే చెరువుల్లో పెద్ద సైజు చేప పిల్లలు, సీజనల్‌గా నీరు ఉండే చెరువుల్లో చిన్న సైజు చేప పిల్లలు వదిలేలా ప్లాన్ చేశారు.
765 చెరువుల్లో చేప పిల్లలు..
జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇప్పటికే 1,080 చెరువులు దాదాపుగా నిండగా, 464 చెరువులు అలుగు పారుతున్నాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల చెరువులు పూర్తిగా నిండగా, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని కొన్ని చెరువులు నిండాల్సి ఉంది. 100 ఎకరాలకు పైగా ఆయా కట్టు ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వదులుతారు. ఈ ఏడాది 765 చెరువుల్లో 2 కోట్ల 80 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక రూపొందించారు.
ప్రతి చెరువులో పది శాతం మోసు, 40 శాతం బొచ్చ, 50 శాతం రోహు వదలాలి. ఈ చేపలు చెరువు పైభాగం, మధ్యభాగం, అడుగు భాగంలో పెరుగుతాయి. ఒక్కో హెక్టారుకు 500 పిల్లల లెక్కన వదలాలి. చెరువులో నిల్వ ఉన్న నీటి పరిమాణాన్ని లెక్కించి, మత్స్యశాఖ అధికారులు ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలు వదలాలో నిర్ణయిస్తారు. చెరువులతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టులో కూడా చేప పిల్లలు వదిలేందుకు కసరత్తు చేస్తున్నారు. కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బిచ్కుంద, పిట్లం, బిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో చేప పిల్లలు విడుదల చేయనున్నారు. గతంలో కొన్ని చోట్ల నిర్దేశించిన సైజు కంటే చిన్న సైజు చేప పిల్లలను వేశారని మత్స్య సహకార సంఘాల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసారి అధికారుల పర్యవేక్షణలో నిర్దేశిత సైజు ప్రకారమే చేప పిల్లలు వదిలేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు.
సీజనల్ చెరువుల్లో..
కట్ల (బొచ్చ), రోహు (తెల్లరకం), శిలావతి – 35 నుంచి 40 మి.మీ. సైజు పిల్లలు
365 రోజులు నీళ్లు ఉండే చెరువుల్లో..
మోసు, రోహు, కట్ల – 80 మి.మీ. సైజు పిల్లలు