
- ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం
మెల్‌బెర్న్ : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సుమిత్ తొలి పోరులోనే వరల్డ్ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్‌ను ఓడించి తన కెరీర్‌లో అతి పెద్ద విక్టరీ సొంతం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ మొదటి రౌండ్‌లో 137వ ర్యాంకర్ నగాల్ 6–4, 6–2, 7–6 (7/5)తో 31వ సీడ్ బబ్లిక్ ( కజకిస్తాన్)కు షాకిచ్చాడు. దాంతో 35 ఏండ్ల తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌పై గెలిచిన ఇండియన్‌గా నిలిచాడు. చివరగా 1989లో రమేశ్ క్రిష్ణన్ అప్పటి వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపి యన్ మాట్స్ విలాండర్ (స్వీడన్)కు షాకిచ్చాడు.
రెండు గంటల 38 నిమిషాల ఈ మ్యాచ్‌లో సుమిత్ సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. తొలి సెట్‌లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 42 నిమిషాల్లో సెట్ నెగ్గాడు. ఆపై ఒక్కసారి కూడా సర్వీస్ కోల్పోకుండా రెండో సెట్ గెలిచిన సుమిత్ మూడో సెట్‌లోనూ ఓ దశలో 5–3తో ముందంజలో నిలిచి మ్యాచ్ కోసం సర్వీస్ చేశాడు.కానీ, నగాల్ సర్వీస్ బ్రేక్ చేసిన బబ్లిక్ సెట్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో గెలిచిన నగాల్.. బబ్లిక్ మైండ్ బ్లాంక్ చేశాడు. గురువారం జరిగే రెండో రౌండ్‌లో అతను 140వ ర్యాంకర్ జుంచెంగ్ షాంగ్ (చైనా)తో పోటీ పడతాడు. ఈ టోర్నీ తొలి రౌండ్ విజయంతోనే అతనికి దాదాపు కోటి రూపాయల ప్రైజ్‌మనీ లభించనుంది. కాగా, గతేడాది చివరకు తన బ్యాంక్ ఖాతాలో రూ.80 వేలు మాత్రమే మిగలడంతో నగాల్ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు.
స్వైటెక్, జ్వెరెవ్ ముందంజ
మెగా టోర్నీలో సీడెడ్ ప్లేయర్లు ముందంజ వేశారు. విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ (పోలాండ్) 7–6 (7/2), 6–2తో 2020 చాంపియన్ సోఫికా కెనిన్ (అమెరికా)ను ఓడించి శుభారంభం చేసింది. ఐదో సీడ్ జెస్సీకా పెగులా (అమెరికా) 6–2, 6–4తో రెబెకా మారినో (స్విట్జర్లాండ్)పై నెగ్గగా, మూడో సీడ్ రిబకినా (కజకిస్తాన్ ) 7–6 (8/6), 6–4తో కరోలినా ప్లిస్కోవా (చెక్)పై గెలిచింది. 11వ సీడ్ ఓస్తపెంకో, 12వ సీడ్ షువై జెంగ్, 18వ సీడ్ విక్టోరియా అజరెంకా కూడా రెండో రౌండ్ చేరుకున్నారు. మెన్స్ సింగిల్స్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 7–6 (7/5), 6–1, 6–2తో రిచర్డ్ గాస్గెట్ (ఫ్రాన్స్)ను ఓడించి బోణీ చేశాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 4–6, 6–3, 7–6 (7/3), 6–3తో తన దేశానికే చెందిన కోఫెర్‌ను ఓడించాడు. ఎనిమిదో సీడ్ హోల్డర్ రూనె, 13వ సీడ్ దిమిత్రోవ్, 11వ సీడ్ కాస్పర్ రూడ్ కూడా తొలి రౌండ్ గెలిచి రెండో రౌండ్ చేరారు.