పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు

పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు
  • మంగళవారం రాత్రి నుంచి ఉద్రిక్తత.. 32 మంది అరెస్ట్
  • బుధవారం రాత్రిపూట మళ్లీ ఉద్రిక్తతలు షురూ  
  • భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు:  గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ చేసిన వివాదాస్పద కామెంట్లపై పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్‌‌ను మళ్లీ అరెస్ట్ చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఓ వర్గానికి చెందిన యువత ఆందోళనలకు దిగింది. మంగళవారం రాత్రి నుంచి నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాజాసింగ్‌‌ దిష్టిబొమ్మలు దహనం చేసింది. మంగళవారం రాత్రి చార్మినార్‌‌‌‌, శాలిబండ, చాంద్రాయణగుట్ట, మొఘల్‌‌పురలో ఒక్కసారిగా యువత రోడ్లపైకి వచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్‌‌ సీపీ డీఎస్‌‌ చౌహాన్‌‌ ఓల్డ్‌‌సిటీలో పర్యటించారు. సౌత్‌‌ జోన్ డీసీపీ సాయిచైతన్యతో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెంట్రల్‌‌ ఫోర్సెస్‌‌ ను మోహరించారు. స్థానిక పోలీసులతో పెట్రోలింగ్‌‌ నిర్వహించారు. మతపెద్దలు, పీస్‌‌ కమిటీ సభ్యులతో మాట్లాడి ఆందోళనలను విరమింపజేశారు.

ర్యాలీలపై నిషేధం..  

ఆందోళనలకు పాల్పడుతున్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా రాత్రి 12 వరకూ తెరిచి ఉంచే షాపులను 8 గంటలకే మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. పాతబస్తీలోని 12 సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్థానిక కార్పొరేటర్లు, మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. యువత రోడ్లపైకి రాకుండా రాత్రి 9 గంటల నుంచే పెట్రోలింగ్‌‌ చేశారు. అనుమానితులు, రౌడీషీటర్లపై స్థానిక పోలీసులతో నిఘా పెట్టారు. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని సౌత్‌‌ జోన్ డీసీపీ సాయి చైతన్య స్పష్టంచేశారు.

మళ్లీ.. మళ్లీ.. ఆందోళనలు 

పాతబస్తీలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. నల్లజెండాలతో యువత ర్యాలీ తీసేందుకు యత్నించారు. శాలిబండలో రోడ్లపైకి వచ్చారు. రాజాసింగ్‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్ద ఎత్తున స్లోగన్స్‌‌ ఇచ్చారు. రాజాసింగ్‌‌ను శిక్షించాలని డిమాండ్‌‌ చేశారు. ఓ దశలో పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌‌ కంటిన్యూ చేశారు. ఓల్డ్‌‌ సిటీ నుంచి గోషామహల్‌‌ వచ్చే రూట్లలో బ్యారికేడ్లు పెట్టారు. మతపెద్దలు, పీస్‌‌ కమిటీ సభ్యులతో మాట్లాడి ఆందోళనలు విరమింపజేశారు. అయితే, రాత్రిపూట మళ్లీ సైదాబాద్, చార్మినార్‌‌‌‌, శాలిబండ, చాంద్రాయణగుట్ట, మొఘల్‌‌పుర ఏరియాల్లో యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   

పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు 

పాతబస్తీలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం రాత్రి నుంచి ఓల్డ్‌‌సిటీ వైపు వచ్చే వాహనాలను డైవర్ట్‌‌ చేస్తున్నట్లు జాయింట్‌‌ సీపీ ఏవీ రంగనాథ్‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేశారు. సాధారణ ట్రాఫిక్‌‌, వినాయక విగ్రహాలను తరలించే వాహనాలను కూడా దారి మళ్ళించినట్లు తెలిపారు. పురానాపూల్ బ్రిడ్జి, ఎమ్‌‌జే బ్రిడ్జ్ నుంచి ఓల్డ్ సిటీ, మలక్‌‌పేట్ వైపు ట్రావెల్‌‌ చేసే వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్ళాలని సూచించారు. నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌‌ఘాట్ బ్రిడ్జి, కాజ్ వే, మూసారాంబాగ్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌‌ ఆంక్షలు ఉంటాయని ఆయన నోటిఫికేషన్​లో తెలిపారు.

పుకార్లను నమ్మొద్దు 

పాతబస్తీలో పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రజాజీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రెచ్చగొట్టే విధంగా కామెంట్స్‌‌ చేసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. ఆందోళనలు, ర్యాలీల కోసం యువత రోడ్లపైకి రావద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. విధ్వంసాలకు పాల్పడినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా క్రిమినల్ కేసులు పెడతాం. 

- సాయిచైతన్య, డీసీపీ, సౌత్ జోన్