
- స్థానికులకు అన్యాయం చేస్తున్నారని నిరసన
- మన్సాన్‌పల్లి, హత్తిగూడలో ఇండ్లు ప్రారంభించిన మంత్రులు సబిత, మహేందర్ రెడ్డి
మహేశ్వరం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రారంభించారు. మన్సాన్ పల్లి చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతోమంది పేదలున్నారని వారికి ఈ డబుల్ఇండ్లు కేటాయించాలన్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. స్థానికంగా ఉండే పేద ప్రజలు ఇండ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడం తగదన్నారు.
ఎల్బీ నగర్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని హత్తిగూడలో 432 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో 11,700 ఇవ్వగా రెండో విడతలో 13,200 ఇళ్లను పంపిణీ చేశామన్నారు. ఇబ్రహీంపట్నంలో 9872, మహేశ్వరం నియోజకవర్గంలో 9892, రాజేంద్రనగర్‌లో 696, ఎల్బీనగర్‌లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లిలో 1512, శేరిలింగంపల్లిలో 344 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు.
బీజేపీ నిరసనతో ఉద్రిక్తత
హత్తిగూడ డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు కాకుండా ఓల్డ్ సిటీకి చెందిన ముస్లింలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తున్నారని బాధితులతో కలిసి బీజేపీ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఆందోళనకు దిగారు. 70 శాతం మంది ఓల్డ్ సిటీకి చెందిన ముస్లింలకు ఇండ్లు ఇచ్చి స్థానికంగా ఉండే ముస్లింలకు అన్యాయం చేశారన్నారు. స్థానికులకే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో బీజేపీ నేత శ్రీధర్ గౌడ్, పారంద సాయి పాల్గొన్నారు.
జవహర్ నగర్ : డబుల్ బెడ్ రూం ఇండ్లు స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఎలా కేటాయిస్తారని జవహర్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. గ్రేటర్ పరిధిలోని వారికి ఇక్కడ ఇండ్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.