వర్ధన్నపేటలో రీకౌంటింగ్తో ఉద్రిక్తత..కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో బీఆర్ఎస్ నిరసన

వర్ధన్నపేటలో రీకౌంటింగ్తో ఉద్రిక్తత..కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో బీఆర్ఎస్ నిరసన
  • రోడ్డుపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 12 వార్డుల్లో ఆరు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, ఐదు కాంగ్రెస్‌‌‌‌, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 12వ వార్డు కౌంటింగ్‌‌‌‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్‌‌‌‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.

తొలుత ఏడు ఓట్ల తేడాతో బీఆర్‌‌‌‌ఎస్ గెలిచిందని ప్రకటించి, తర్వాత 13 ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించిందని ఆర్వో ప్రకటించడంపై నిరసన తెలిపారు. రీకౌంటింగ్ విషయంలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని మండిపడ్డారు. 

మరోసారి కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయనను అరెస్ట్ చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

స్వతంత్ర కౌన్సిలర్​ను అప్పగించాలని ధర్నా..

ఐదో వార్డు స్వతంత్ర అభ్యర్థి షిబారాణి ఓటు చైర్​పర్సన్​ ఎన్నికలో కీలకం కావడంతో, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు ఆమెను కిడ్నాప్ చేశారని తండావాసులు అన్నారు. తమ అభ్యర్థిని అప్పగించాలని క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా తమపై దాడి జరిగిందని ఆరోపించారు. 

దీంతో జాతీయ రహదారి 563పై ధర్నాకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థులు క్యాంపు నుంచి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాలు తీసుకుని తిరిగి క్యాంపునకు చేరుకున్నారు.