పశ్చిమ బెంగాల్లో మరోసారి ఉద్రిక్తత.. హౌరాలో పేలిన నాటు బాంబులు

పశ్చిమ బెంగాల్లో మరోసారి ఉద్రిక్తత.. హౌరాలో పేలిన నాటు బాంబులు

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌరా జిల్లాలో ఉన్న శిబ్‌పూర్ మురికివాడలో గురువారం నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పేలుళ్లలో స్థానికులు గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి ఇటుకలు గాలిలోకి ఎగిరిపడటంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్పాట్కు చేరుకున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మద్దతుగా నిలిచారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజేపీ మైనారిటీ సెల్ నాయకుడు మనోజ్ ఖాన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ సమయంలో కొందరు దుండగులు సమీపంలోని దుకాణాలను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ హింసాత్మక ఘటనలో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజుల వ్యవధిలోనే ఒకటికి రెండు హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ఆ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలో ఉన్నారు.

బీజేపీ కీలక నాయకుడు, ప్రతిపక్ష మాజీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. సీఎం రేసులో ఉన్న కీలక నేత పీఏ గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కోల్‌కతా సమీపంలోని ఉత్తర 24 పరగణాల జిల్లా.. మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. 

►ALSO READ | ముంబైలో దుమ్ము తుఫాన్.. ఎప్పుడూ లేనంత ధూళితో సిటీ అతలాకుతలం !

చంద్రనాథ్ రథ్ తన స్నేహితుడు బుద్ధదేవ్‌తో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బుద్ధదేవ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.