- తొలగించిన బీఆర్ఎస్ కార్యకర్తలు
- సిద్దిపేటలోనూ పెట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఏర్పాటు అంశం రాజకీయ వేడిని పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ప్రజాపాలన సభల్లో బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు చింపివేసిన ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్‌గా ఫొటో ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించాయి. ఏడాది క్రితం సీఎం ఫొటోతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక గజ్వేల్‌లో శనివారం డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారు. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకుని ఆ ఫొటోను తొలగించారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కడవెర్గు మంజుల ఛాంబర్‌లో కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు గతంలో బలవంతంగా సీఎం ఫొటో ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆదివారం ఆందోళన కార్యక్రమం చేపట్టనుంది.
