సర్కారుపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గుర్రు

సర్కారుపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గుర్రు
  • కానోళ్లతో పాటు అయినోళ్లూ.. పుట్టి ముంచుతరేమో
  • తామేందో ఓటింగులో చూపిస్తామని కామెంట్లు
  • కరీంనగర్ లో రెండు సీట్లలోనూ టైట్ ఫైట్?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లో టెన్షన్‌‌‌‌ పెంచుతున్నాయి. 12 సీట్లలో ఆరింటిని ఏకగ్రీవంగా దక్కించుకున్నా మిగతా వాటిల్లో అసంతృప్తులు, రెబల్స్ వంటి తలనొప్పులు ఎన్ని చోట్ల దెబ్బ తీస్తాయోనని ఆందోళన పడుతోంది. సంఖ్యా బలాన్ని బట్టి సీట్లన్నీ తమకే దక్కాల్సి ఉన్నా క్రాస్ ఓటింగ్‌‌‌‌ భయం అధికార క్యాండిడేట్లను భయపడుతోంది.పలు జిల్లాల్లో కొందరు సీనియర్లు పార్టీ తీరుపై గుర్రుగా ఉండటం, మెజార్టీ ఓటర్లయిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేస్తుండటం టీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోంది. ముఖ్యంగా కరీంనగర్‌‌‌‌లో ఎదురుదెబ్బ తగలవచ్చని హైరానా పడుతోంది. ఒక్క ఓటు కూడా మిస్సవకుండా అందరినీ క్యాంపులకు తరలించే పనిలో పడ్డారు. ఆల్రెడీ క్యాంపులో ఉన్న వాళ్లను ఏకంగా గోవా షిఫ్ట్‌‌‌‌ చేశారు. కరీంనగర్ ఓటర్లందరినీ ఒకేచోట పెట్టకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి పోలింగ్‌‌‌‌ నాడు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌ శివార్లలోని అన్ని రిసార్టులను బుక్‌‌‌‌ చేసి క్యాంపులు పెట్టారు. కరీంనగర్‌‌‌‌ ఓటర్లను గోవాకు పంపగా మిగిలిన వాళ్లను బెంగళూరు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిధులు, విధుల్లేవంటూ సర్కారుపై కోపంతో ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఓటింగ్ వేళ ఏం చేస్తారోనని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలొస్తే తప్ప తమను పట్టించుకోరా అని విమర్శలు చేస్తున్నారు. క్యాంపులో పెట్టినా సరే, ఓటింగప్పుడు ఏం చేయాలో అది చేస్తామంటున్నారు.

ఆదిలాబాద్​లో ఆదిలోనే...
ఆదిలాబాద్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి దండె విఠల్‌‌‌‌పై సొంత పార్టీ ఓటర్లలోనే వ్యతిరేకత ఉంది. ఆయనపై పోటీకి దిగిన ఇండిపెండెంట్‌‌‌‌ పెందూర్‌‌‌‌ పుష్పారాణికి తుడుం దెబ్బ సహా గిరిజన సంఘాలు మద్దతుగా ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లన్నీ ఆమెకే పడేలా సంఘాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇదీ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను భయపెడుతోంది. ఖమ్మంలో తాతా మధుకు టికెటివ్వడంపైనా సొంత పార్టీలోనే భిన్న వాదనలున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి వర్గీయులు ఆయనకు సహకరించడం అనుమానంగా మారింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు వైఖరీ అంతుపట్టడం లేదు. ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌ నుంచి గట్టి పోటీ ఉండొచ్చనే అంచనాతో వామపక్షాలను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మద్దతు కోరింది. నల్గొండలో కాంగ్రెస్‌‌‌‌ పోటీలో లేకున్నా ఆ పార్టీ ఓటర్లు మాజీ ఎమ్మెల్యే నగేశ్‌‌‌‌కు అండగా నిలిచేలా కనిపిస్తున్నారు. మెదక్‌‌‌‌లోనూ కాంగ్రెస్‌‌‌‌ నుంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు పోటీ ఎదురవుతోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలను ఇక్కడ బరిలో ఉన్నారు. సొంత ఓటర్లను కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్‌‌‌‌ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మంత్రి హరీశ్‌‌‌‌ ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లు. వీరిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు లేవు. జిల్లా, మండల పరిషత్‌‌‌‌లకు బడ్జెట్‌‌‌‌లో రూ.500 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించినా వాటిని విడుదల చేయలేదు. ఎంపీటీసీలకు పంచాయతీల్లో కుర్చీలు కూడా లేవు. మండల పరిషతుల్లో జడ్పీటీసీలదీ అదే పరిస్థితి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం 30% వేతనాలు పెంచే జీవోను కోడ్‌‌‌‌ రాకతో వెనక్కు తీసుకున్నారు. అందరికీ జీతాలు పెంచి తమకు మాత్రం ఇలా చేశారని వాళ్లు గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ తమ పుట్టి ముంచేలా ఉన్నాయని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్లు వాపోతున్నారు.

కరీంన‘గరంగరం’
రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాల్లో రెండేసి, నిజామాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ సీట్లలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా ఆరింటిలో ఆదిలాబాద్‌‌‌‌లో ఇద్దరు, నల్గొండలో ఏడుగురు, మెదక్‌‌‌‌లో ముగ్గురు, ఖమ్మంలో నలుగురు, కరీంనగర్‌‌‌‌లో రెండు సీట్లకు 10 మంది పోటీలో ఉన్నారు. కరీంనగర్‌‌‌‌లోని రెండు సీట్లపై నామినేషన్లప్పుడే హైరానా మొదలైంది. సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌‌‌‌రావుతో పాటు టీడీపీ నుంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన పార్టీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్‌‌‌‌.రమణకు టికెటిచ్చారు. కరీంనగర్‌‌‌‌ మాజీ మేయర్‌‌‌‌ రవీందర్‌‌‌‌సింగ్‌‌‌‌ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌‌‌‌ వేశారు. వెలమ కులానికి చెందిన భానుప్రసాద్‌‌‌‌రావును ఓడించి తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై తిరుగుబాటు చేసిన ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌‌‌‌ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్లను ఓడించాలని సారబుడ్ల ఇప్పటికే పిలుపిచ్చారు. మిగతా ఏడుగురు క్యాండిడేట్లను తనవైపు తిప్పుకునేందుకు రవీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను క్యాంపులకు తరలించినా కొందరు అక్కన్నుంచి ఎస్కేపయ్యారు. దాంతో మిగతా వారిని శనివారం వేరే చోటికి మార్చారు.