భగ్గుమన్న ఇనుగుర్తి, ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలకు శవయాత్ర, దహనం

భగ్గుమన్న ఇనుగుర్తి, ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలకు శవయాత్ర, దహనం

మల్లంపల్లిపై సీఎం మాట తప్పారని ఎమ్మెల్యే సీతక్క విమర్శ 

ములుగు, నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: ఉమ్మడి జిల్లాలో మరో రెండు మండలాల ఏర్పాటుపై నిరీక్షణ తప్పడం లేదు.  ములుగు జిల్లా మల్లంపల్లి, మహబూబాబాద్​జిల్లా ఇనుగుర్తి గ్రామాలను మండలాలు చేయాలని కొన్నేండ్లుగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. మండలాల ఏర్పాటుకు సాధన సమితులను ఏర్పాటుచేసుకొని కొన్నేండ్లుగా పోరాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికార పార్టీ నాయకులు మండలాల ఏర్పాటుపై హామీ ఇస్తూ  వస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో 13 మండలాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లిస్ట్​లో ఈ రెండు మండలాల పేరు లేకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇనుగుర్తి బంద్​కు పిలుపు.. 

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటుచేస్తామని చెప్పి టీఆర్ఎస్ లీడర్లు మోసం చేశారని ఇనుగుర్తి ప్రజలు మండిపడుతున్నారు. ఆదివారం రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా  మండల సాధన సమితి ఆధ్వర్యంలో విద్రోహ దినంగా పేర్కొంటూ బంద్​కు పిలుపునిచ్చారు. సీఎం, జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొన్నేండ్లుగా ఇనుగుర్తిని మండలంగా చేయాలని మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. అధికార 
పార్టీ లీడర్లు పలుమార్లు వివిధ వేదికల్లో ఇనుగుర్తి మండలం తెచ్చుడో సచ్చుడో అంటూ బూటకపు మాటలు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతామని, మండలం ఏర్పాటుచేయకపోతే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. తక్షణమే ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. 

మల్లంపల్లిపై అదే ఊగిసలాట... 

మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్లుగా ఉన్న కోరిక ఈసారీ తీరలేదు. మల్లంపల్లి ఇటు హనుమకొండ, ములుగు, నర్సంపేట ప్రాంతాలకు కూడలిగా, వ్యాపార కేంద్రంగా ఉంది. మేజర్​పంచాయతీగా ఉన్న మల్లంపల్లి మండల ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక. 2018ఎన్నికల ప్రచారంలో మల్లంపల్లిని మండలంగా చేస్తామని సీఎం కేసీఆర్​మాట ఇచ్చారని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తాజాగా ప్రకటించిన మండలాల లిస్టులో మల్లంపల్లి లేకపోవడం దారుణమన్నారు. ఎన్నికల టైంలో స్థానిక ప్రజాప్రతినిధులు మండలం పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్​పర్యటన సందర్భంగా మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజుతోపాటు కొంగరి నరేందర్​, బాబు, ఆఫ్రిదీలను ముందస్తు అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​ కు తరలించగా వారిని సీతక్క కలిసి పరామర్శించారు. ఇప్పటికైనా మల్లంపల్లిని ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. సీతక్క వెంట కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, కిసాన్​సెల్​ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్​గౌడ్​, యూత్ అధ్యక్షుడు బానోతు రవిచందర్​, మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎండీ.చాంద్​ పాషా, ఆత్మ డైరెక్టర్​ చంద్రమౌళి తదితరులు ఉన్నారు.