
నిజామాబాద్, వెలుగు : ఇందూర్ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. మాణిక్‌భవన్ స్కూల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా, గొడవల కారణంగా రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. 10,017 మంది ఓటర్లు గ్రూపులుగా విడిపోయారు. ఏకగ్రీవ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. నగర ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బాబాయ్ కొడుకు ధన్పాల్ శ్రీనివాస్, వ్యాపారవేత్త అర్వపల్లి పురుషోత్తంగుప్తా తలపడ్డారు.
ఒకరికి బీజేపీ సపోర్టు ఉండగా, మరొకరికి కాంగ్రెస్ మద్దతు ఉంది. నగరంలోని ఆర్యవైశ్య హైస్కూల్ కమిటీ, వైశ్య భవన్ కమిటీ, కన్యాకాపరమేశ్వరీ టెంపుల్ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. బ్యాలెట్ పేపర్స్ బయటకు రావడంతో పాటు ఒక ప్యానెల్ సభ్యులు దగ్గరుండి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్ సెంటర్లోకి ప్రవేశించి గొడవ చేశారు. ఎలక్షన్ రద్దు చేయాలని నినాదాలు ఇచ్చారు. పోలీసులు వచ్చి శాంతింపజేశారు. సోమవారం కన్యాకాపరమేశ్వరీ ఆలయంలో ఓట్ల లెక్కింపు జరుగనున్నదని సంఘం ప్రతినిధులు తెలిపారు.