తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
  • ఏప్రిల్​ 2 వరకు నిర్వహణ
  • హాజరుకానున్న 5.08 లక్షల మంది స్టూడెంట్లు 
  • ఐదు నిమిషాల వరకు 
  • గ్రేస్ టైమ్​.. ఎగ్జామ్​ సెంటర్ల 
  • వద్ద మూడంచెల భద్రత

హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు  జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు. 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పరీక్షలు కొనసాగుతాయి.

ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్షా సమయానికి ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్లను కూడా ఎగ్జామ్​ సెంటర్​లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్​ 040– 23230942కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.   

మూడంచెల భద్రత

నిరుడు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో హిందీ పేపర్​ లీక్​ అయిన నేపథ్యంలో ఈసారి ఆఫీసర్లు ముందే అలర్ట్ అయ్యారు. పేపర్​ లీకేజీలతో పాటు ఇతర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్ల వద్ద సిట్టింగ్ స్క్వాడ్​ ను నియమిస్తున్నారు. అంతేగాకుండా  పోలీస్​, రెవెన్యూ తో పాటు ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులకు కూడా విధులు కేటాయిస్తున్నారు.

గత పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్​ పకడ్బందీగా అమలు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్లలో పనిచేసే సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయట పెట్టేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.