- సీఎస్, డీజీపీలకు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సరోగసీ (అద్దెగర్భం) మహిళ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సీరియస్ అయింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళ తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి దిగుతూ కిందపడి చనిపోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బాధితురాలు లైంగిక వేధింపుల కారణంగానే తప్పించుకునేందుకు ప్రయత్నించి, చనిపోయిందని తాము గుర్తించినట్లు వెల్లడించింది.
ఈ ఘటన నిజమైతే బాధితురాలి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ స్టేటస్, తీసుకున్న చర్యలు తదితర విషయాలపై తమకు సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. అలాగే, ఇంతకుముందు నమోదైన సరోగసీ వివరాలను కూడా ఇవ్వాలని తెలిపింది. కాగా.. ఒడిశాకు చెందిన ఓ మహిళను సరోగసీ ద్వారా బిడ్డను కనివ్వాలని రూ.10 లక్షలకు ఓ ఫ్యామిలీ ఒప్పందం కుదుర్చుకొని గత నెల 24న హైదరాబాద్ తీసుకువచ్చారు.
అప్పటి నుంచి ఆమె రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ ఫ్యామిలీతో కలిసి 9వ అంతస్తులో ఉంటుంది. ఆమె భర్త, నాలుగేండ్ల కొడుకు అక్కడే సర్వేంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. అయితే, ఆమెపై సరోగసీ కోసం తీసుకొచ్చిన వ్యక్తే వేధింపులకు గురి చేయడంతో తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో బిల్డింగ్‌పై నుంచి జారి కింద పడి చనిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి.