ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
  • చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం
  • చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు
  • సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఘటన

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్‌‌ (30) పదేండ్లుగా హైదరాబాద్‌‌లో ఉంటూ కారు డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య నాగమణి, పిల్లలు లాస్య (4), లావణ్య ఉన్నారు.

లాస్యకు చెవులు కుట్టించేందుకు భార్య, పిల్లలతో పాటు, బంధువులు నల్లమల మాణిక్యమ్మ (48), నల్లమల చంద్రారావు (55), కృష్ణంరాజు (30), స్వర్ణకుమారి (26), కౌశిక్‌‌‌‌, కార్తీక్‌‌‌‌తో కలిసి ఎర్టీగా కారులో హైదరాబాద్‌‌‌‌ నుంచి విజయవాడ సమీపంలోని గుణదల చర్చికి గురువారం ఉదయం బయలుదేరారు. కృష్ణంరాజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణ శివారులోని శ్రీరంగాపురం వద్దకు రాగానే రోడ్డు పక్కన బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ప్రమాదంలో శ్రీకాంత్‌‌‌‌, లాస్య, మాణిక్యమ్మ, చంద్రారావు, కృష్ణంరాజు, స్వర్ణకుమారి స్పాట్‌‌‌‌లోనే చనిపోయారు.

శ్రీకాంత్ భార్య నాగమణి, అతని కుమార్తె లావణ్యతో పాటు బంధువుల పిల్లలు కౌశిక్‌‌‌‌, కార్తీక్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ రాహుల్‌‌‌‌ హెగ్డే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతున్న వారిని పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, బంధువులు కోదాడ హాస్పిటల్​కు చేరుకుని బోరున విలపించారు. 

ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్ర్భాంతి

కోదాడ బైపాస్‌‌‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోవడంపై సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.