బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు..10 మంది మృతి

బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు..10 మంది మృతి

జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. రియాసీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాట్రా నుంచి పరమశివుని పుణ్యక్షేత్రమైన శివ్ ఖోరికి యాత్రికులు ఓ బస్సులో బయల్దేరారు. అకస్మాత్తుగా ఆ బస్సుపై టెర్రరిస్టులు దాడి చేశారు. దీంతో బస్సు సమీపంలో ఉన్న కాందా చండీ లోయలో పడింది. 

ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన తర్వాత హాస్పిటల్ కు తరలించారు. మాస్క్ వేసుకున్న ఇద్దరు టెర్రరిస్టులు బస్సుపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు సమాచారం. కాల్పులు జరిపిన తర్వాత పారిపోయిన టెర్రరిస్టుల గురించి గాలిస్తున్నారు పోలీసులు. 

జమ్ము కశ్మీర్ లో టెర్రరిస్టు దాడిపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలకు అన్ని సహాయాలు అందించాలని ప్రధాని ఆదేశించారని ట్వీట్ చేశారు లెఫ్టినెట్ గవర్నర్ సిన్హా. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని, భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయన్నారు. దాడి వెనుక ఉన్న వారిని తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు. 

జమ్ము కశ్మీర్ లో టెర్రరిస్టుల దాడిపై కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నానని  చెప్పారు. ఈ పిరికిపంద దాడి చేసిన వారిని వదలిపెట్టబోమని ట్వీట్ చేశారు. 

జమ్ము కశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడి బాధాకరమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఘటన ఆందోళనకరంగా ఉన్నభద్రత పరిస్థితికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కతాటిపై నిలుస్తుందని ట్వీట్ చేశారు.  మరోవైపు జమ్ము కశ్మీర్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు ద్రౌపది ముర్ము. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.