రూట్ మార్చిన టెర్రరిస్ట్‌ గూపులు..మెడికోలు, టెకీలే టార్గెట్​..

రూట్ మార్చిన టెర్రరిస్ట్‌ గూపులు..మెడికోలు, టెకీలే టార్గెట్​..

 

  • రూట్ మార్చిన టెర్రరిస్ట్‌ గూపులు
  • మెడికల్ కాలేజీలు,సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగులుగా చేరి..
  • రిక్రూట్ మెంట్స్, సైలెంట్ గా కార్యకలాపాలు 
  • బయోకెమికల్‌,బ్యాక్టీరియాతో విధ్వంసాలకు స్కెచ్‌
  • మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో బయటపడ్డ ఉగ్రకుట్ర

హైదరాబాద్: టెర్రరిస్ట్‌లు రూట్ మార్చారు. మెడికోలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగలను టార్గెట్‌ చేసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. గతంలో హ్యూమన్ బాంబులు, గ్రెనేడ్స్‌తో పేలుళ్లు జరిపిన ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం హై టెక్నాలజీ, బ్యాక్టీరియా, కెమికల్స్‌తో విధ్వంసాలకు వ్యూహరచన చేస్తున్నాయి. సైన్స్‌, ఆధునిక టెక్నాలజీపై అనుభవం ఉన్న యువతను టార్గెట్‌ చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఇందులో మెడికోలు, ఐటీ ఉద్యోగులను ఉగ్రవాదులు సానుభూతిపరులుగా మార్చుకుని అల్లర్లు, దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో బయటపడింది. భోపాల్ కేంద్రంగా ‘హిజ్బ్‌ ఉత్‌ తహరిర్‌‌’టెర్రర్ గ్రూప్‌ ఆపరేషన్‌లో హైదరాబాద్‌ మూలాలు బయటపడడంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానితులపై నిఘా పెంచారు. పరారీలోఉన్న సల్మాన్ కోసం నాలుగు టీమ్స్‌తో సెర్చ్‌ చేస్తున్నారు. 

మెడికోలు,టెకీలే టార్గెట్‌ 

మెడికోలు,టెకీలు,స్టూడెంట్స్‌తో విధ్వంసాలు సృష్టించేందుకు హిజ్బ్‌ ఉత్‌ తహరిర్‌ ప్లాన్ చేసింది. ఇందుకోసం భోపాల్‌కు చెందిన మహ్మద్‌ సలీం అలియాస్ సౌరభ్‌ రాజ్‌ వైద్య హైదరాబాద్‌లోని డెక్కన్ కాలేజీలో ఫార్మాస్యూటికల్‌ బయోటెక్నాలజీ హెచ్‌ వోడీగా నియమించింది. ఇందుకు స్థానికులు కూడా సహకరించినట్లు దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి. కాలేజీలో పనిచేస్తూ సలీం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా కాలేజీలోని మెడికోలను ఆకర్శించే విధంగా సమావేశాలు నిర్వహించేవాడు. ఇస్లామిక్‌ సాహిత్యం, బయోటెక్నాలజీతో బ్యాక్టీరియా తయారీపై వివరించేవాడు. స్టూడెంట్స్‌ను టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ వైపు మళ్లించి భోపాల్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు.

గోల్కొండ అడ్డా 

మహ్మద్ సలీం గోల్కొండ బడాబజార్‌‌లో షెల్టర్ తీసుకున్నాడు. అదే ప్రాంతంలో డెంటల్ డాక్టర్‌‌ షేక్ జునైద్‌ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఇద్దరు కలిసి స్థానిక యువత, మెడికోలను ఉద్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వీరితో పాటు ఇబదూర్ రెహమాన్‌ మజీద్‌ సమీపంలో ఒడిశాకు చెందిన అబ్దుల్ రెహమాన్‌ అలియాస్‌ దేవీప్రసాద్ పాండా నివాసం ఉంటున్నాడు. రెహమాన్‌ ఓ ప్రముఖ ఎంఎన్సీలో క్లౌడ్‌ సర్వీస్ ఇంజినీర్‌‌గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి మెడికోలు, ఐటీ ఉద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. రెహమాన్‌ తను పనిచేసే కంపెనీలోని టెకీలను ఉద్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేశాడు. వీకెండ్స్‌లో ఔట్‌ డోర్‌‌ ట్రైనింగ్ పేరుతో పలుమార్లు భోపాల్‌, మహారాష్ట్ర, బెంగళూర్‌‌లో ట్రైనింగ్‌కి తీసుకెళ్లాడు. క్లౌడ్‌ సర్వీసెస్ లో అనుభవం ఉండడంతో విధ్వంసాలకు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌‌ వినియోగించాలనే విషయంలో సానుభూతి పరులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.