కర్ణాటకలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. వ్యక్తి మృతి

కర్ణాటకలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. వ్యక్తి మృతి

కొత్త JN.1 జాతి వ్యాప్తి మధ్య రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరడంతో, కర్ణాటక నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో ఓ 64 ఏళ్ల వ్యక్తికి కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్థారించారు. అతను డిసెంబర్ 15 న మరణించాడు. రోగికి కొమొర్బిడిటీలు ఉన్నాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, అలసట, ఆకలి లేకపోవడంతో బాధపడ్డాడని ఓ నివేదిక పేర్కొంది.

ఛాతి భాగంలో రోగికి ఎక్స్-రే తీయగా తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణ ఉన్నట్టు తేలింది. రోగికి కొవిడ్ -19 పాజిటివ్ అని వెల్లడి కావడంతో.. ఐసోలేషన్ వార్డుకు తరలించి, NIV సపోర్ట్‌లో ఉంచారని ఓ నివేదిక తెలిపింది. అతను యాంటీబయాటిక్స్, యాంటీ-వైరల్, యాంటిహిస్టామైన్, స్టెరాయిడ్స్, UFHతో చికిత్స పొందాడు. కానీ అతని పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అతను తీవ్రమైన కోవిడ్ న్యుమోనియా, గుండె వైఫల్యం, కార్డియోజెనిక్ షాక్‌తో మరణించినట్లు ఆసుపత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి.

అతను పల్మనరీ ట్యూబర్‌క్యులోసిస్, బ్రోన్చియల్ ఆస్తమా, ఇంటర్‌స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి, ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్‌తో కూడా బాధపడినట్టు సమాచారం. అయితే, కర్ణాటక ఆరోగ్య శాఖ రోజువారీ కొవిడ్-19 నివేదికలో అతని మరణాన్ని ఇంకా పేర్కొనలేదు.