కరోనా లక్షణాలు లేకున్నా టెస్టులు

కరోనా లక్షణాలు లేకున్నా టెస్టులు

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర సర్కారు నిర్ణయం మారింది. పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్​ అందరికీ వైరస్​ లక్షణాలు ఉన్నా లేకున్నా టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే హోమ్ క్వారంటైన్‌‌లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌‌  వ్యక్తులను దవాఖానాల్లోని క్వారంటైన్​ సెంటర్లకు తరలిస్తున్నారు. గత రెండ్రోజుల్లో నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌  సెంటర్‌‌‌‌కు 194 మందిని, నిజామియా దవాఖానా‌‌కు 160 మందిని, సరోజని దేవి కంటి దవాఖానాకు సుమారు 155 మందిని తరలించారు. వీరికి అక్కడ టెస్టులు చేసి పాజిటివ్ వస్తే గాంధీకి  నెగెటివ్ వస్తే హోమ్‌‌ క్వారంటైన్‌‌కు పంపిస్తున్నారు.

అన్నివైపులా ఒత్తిడితో..

రాష్ట్రంలో ఏప్రిల్ మూడో వారం వరకు ప్రైమరీ కాంటాక్ట్  అందరికీ టెస్టులు చేయించిన సర్కార్‌‌‌‌.. తర్వాత స్ట్రాటజీ మార్చింది. లక్షణాలున్న వారికే టెస్ట్ చేయించాలని నిర్ణయించింది. పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులైనా సరే లక్షణాలు లేకుంటే టెస్టులు చేయలేదు. దీనిపై కేసులు నమోదైన చోట స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకూ కంప్లయింట్​ చేశారు. ఆయా లీడర్లు హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులపై ఒత్తిడి చేశారు. గ్రేటర్ శివారు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకరు టెస్టుల కోసం హెల్త్ మినిస్టర్‌‌‌‌ ను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఇక టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. కేంద్ర హెల్త్​ మినిస్టర్​ కూడా టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే సింప్టమ్స్ లేనివారికి కూడా టెస్టులు చేయించాలని సర్కారు నిర్ణయించింది.

20 రోజుల కిందటి నుంచీ..

ప్రస్తుతం పాజిటివ్ వస్తున్నవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌‌తో పాటు.. ఏప్రిల్ 22 తర్వాత పాజిటివ్ వచ్చిన వారందరి ప్రైమరీ కాంటాక్ట్స్​కు టెస్టులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్‌‌ కు తరలిస్తున్నారు. వారిలో కొందరిని పాజిటివ్​గా గుర్తించారు. రెండు రోజులుగా కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని అధికారులు చెప్తున్నారు.