టీచర్ల ప్రమోషన్లకు టెట్ ఎఫెక్ట్.. సీనియర్లు దూరమయ్యే చాన్స్

 టీచర్ల ప్రమోషన్లకు టెట్ ఎఫెక్ట్..  సీనియర్లు దూరమయ్యే చాన్స్

టీచర్ల ప్రమోషన్లకు ‘టెట్’ అడ్డంకిగా మారింది. కొత్తగా వచ్చే టీచర్లతో పాటు, ప్రమోషన్లు పొందాలన్నా తప్పకుండా టెట్ క్వాలిఫై కావాల్సిందేనన్న అర్థం వచ్చేలా నేషనల్ కౌన్సిల్‌‌ ఫర్  టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌‌సీటీఈ) గైడ్​లైన్స్ తెరమీదికి తెచ్చింది. ఈ రూల్స్​ టీచర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు ఆ నిబంధనలను అమలు చేయాల్సిందేనని కొందరు టీచర్లు హైకోర్టునూ ఆశ్రయించారు. దీంతో తీర్పు ఎలా వస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. ఈ నెల 3 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ట్రాన్స్​ఫర్లకు ఏకంగా 81,069 మంది అప్లై చేసుకున్నారు.

ALSO READ: వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం: పొన్నం ప్రభాకర్​

ఇదే టైంలో ఎన్‌‌సీటీఈ గైడ్​లైన్స్ తెరమీదికి వచ్చాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే టీచర్లతో పాటు ప్రమోషన్లు పొందే టీచర్లకూ టెట్ క్వాలిఫై కావాలనే నిబంధన అమలు చేయాలని కొందరు టీచర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్​సీటీఈ రూల్స్​ ను అమలు చేయాలని పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రమోషన్ల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న సీనియర్ టీచర్లలో ఆందోళన మొదలైంది. ఒకవేళ హైకోర్టు ఎన్​సీటీఈ రూల్స్ ఫాలో కావాలని తీర్పునిస్తే,  ప్రమోషన్ల కోసం సీనియార్టీ లిస్టులన్నీ మారే అవకాశముంది. ఈ ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే చాన్స్ ఉంది.

 సీనియర్లు దూరమయ్యే చాన్స్​

రాష్ట్రంలో 2015లో టీచర్లకు బదిలీలు నిర్వహించి, ప్రమోషన్లు ఇచ్చారు. 2018లో కేవలం బదిలీలు మాత్రమే చేపట్టారు. తాజాగా ఈ ఏడాది బదిలీలు, ప్రమోషన్లు చేపడుతున్నారు. ప్రస్తుతం 9,979 మంది టీచర్లు ప్రమోషన్లు పొందనున్నారు. 1,947 గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు, 2,162 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు కొత్తగా భర్తీ చేయబోయే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ పోస్టుల్లోనూ 70% ప్రమోషన్ల ద్వారానే నింపనున్నారు. ఈ టైంలో ఎన్​సీటీఈ నిబంధనలు అమలు చేస్తే.. సీనియర్లంతా ప్రమోషన్లకు దూరమయ్యే చాన్స్ ఉంది. 

హెడ్మాస్టర్ల బదిలీలు రెండు మూడ్రోజులు లేట్..

హెడ్మాస్టర్ల బదిలీల ప్రక్రియ రెండు మూడు రోజులు ఆలస్యం కానున్నది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల కోసం జనవరిలో ఇచ్చిన జీవో నంబర్ 5లో పేర్కొన్న కటాఫ్ డేట్ తేదీని.. తాజాగా సెప్టెంబర్ 1కి మార్చారు. అయితే, గతంలో ఇచ్చిన జీవోకు సవరణ ఇవ్వలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12,13 తేదీల్లో జరగాల్సిన హెడ్మాస్టర్ల ట్రాన్స్ ఫర్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగిపోయింది. అయితే, బుధవారం ఆ జీవోకు సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని గురువారం కోర్టుకు విద్యాశాఖ సడ్మిట్ చేయనుంది. ఈ నెల 15 టెట్ ఎగ్జామ్ ఉంది. దీంతో ఈ నెల 16,17 తేదీల్లో హెడ్మాస్టర్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఇచ్చే అవకాశముంది