హైదరాబాద్, వెలుగు: అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల కోసం టీజీ సైబర్ సెక్యురిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. సైబర్ నేరగాళ్లు వినియోగించిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నమోదైన 3 కేసుల్లో రూ.16.20 కోట్ల ఆధారంగా కేరళ, కర్నాటకలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
ఐదుగురు బ్యాంక్ అకౌంట్ల హోల్డర్లు, ఓ ఏజెంట్‌ను అరెస్ట్ చేసింది. ఈ మేరకు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మూడు కేసులకు సంబంధించి రెండు ప్రత్యేక బృందాలను కేరళకు, బెంగళూరుకు పంపారు. 2024, డిసెంబర్ 9న ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరిట రూ.5.66 కోట్లు కొల్లగొట్టారు. 2026, జనవరి 2న ఒక వృద్ధుడిని బెదిరించి 2 నెలల్లో రూ.7.12 కోట్లు బదిలీ చేయించుకున్నారు. బెగంపేటకు చెందిన ఓ వ్యాపారిని ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.3.40 కోట్లు కొల్లగొట్టారు.
