
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు 93.59% మంది, ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు 94.04% మంది విద్యార్థులు అటెండ్ అయినట్టు ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 86,762 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 81,198 మంది హాజరయ్యారు. మరో 5,564 మంది హాజరు కాలేదు.
ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు ఈ నెల 2,3,4 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,20,327 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 2,07,190 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 13,137 మంది గైర్హాజరయ్యారు. కాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను https://eapcet.tgche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టారు. విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే మే 6న మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు సోమవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నారు.