- లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో రంగంలోకి ఎన్పీడీసీఎల్
- ప్రకటించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సహకార రంగంలో 56 ఏండ్లుగా తమ ఉత్తమ సేవలు అందించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ప్రస్థానం ముగిసింది. నేటి నుంచి సెస్ సేవలన్నీ ఎన్పీడీసీఎల్ పరిధిలోకి రానున్నాయి.
సంస్థ లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో కార్యకలాపాలను ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకుంది. సెస్ పరిధిలోని విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, ఎన్పీడీసీఎల్ లో ఉండే అన్ని సేవలూ సెస్పరిధిలో కూడా తెస్తామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు.
వెలుగు వెలిగి చీకట్లలోకి..
కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్ఈసీ ) 1969లో దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలను స్థాపించింది. దాంట్లో సిరిసిల్ల ‘సెస్’ ఒక్కటి. కాలక్రమంలో ఆ సంస్థలన్నీ ఉనికికోల్పోయినా.. సిరిసిల్ల సంస్థ మాత్రం తన సేవలను నిలబెట్టుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మండలాలతోపాటు కొడిమ్యాల మండలంలోని రెండు గ్రామాలకు 5 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. జిల్లాలో వ్యవసాయాభివృద్ధి, వస్త్రోత్పత్తి రంగ అభివృద్ధికి సెస్ బాటలు వేసింది.
అడిగిన వెంటనే కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం, ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో రిపేర్ చేయడం సెస్ స్పెషాలిటీ. దీనికి అనుగుణంగా వినియోగదారులు కూడా తప్పకుండా కరెంట్ బిల్లులు చెల్లించి, సంస్థ అభివృద్ధికి సహకరించేవారు. ఇంతటి ప్రతిష్టాత్మకతను సంతరించుకున్న సెస్‌పై గత కొన్నేండ్లుగా చీకట్లు కమ్ముకున్నాయి. అవినీతి ఆరోపణలు, రాజకీయాలు వెరసి సెస్ మనుగడకే ఎసరు వచ్చింది. 1970 నుంచి స్వతంత్ర సంస్థ కొనసాగిన సెస్ఇప్పుడు ఎన్పీడీసీఎల్ లోకి వెళ్లింది. సెస్ పాలక మండలి కార్యకలాపాలకు చెక్ పడగా.. కమిటీ ఏం చేయబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
లైసెన్స్ రెన్యూవల్ కాలే..
ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి సెస్ లైసెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవల్ చేస్తోంది. 2021లో చివరిసారి రెన్యువల్ కాగా.. ఈ ఏడాది రెన్యూవల్ కోసం సెస్ ఆఫీసర్లు 3 నెలల ముందు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అది మార్చి 31లోపు రెన్యూవల్ కావాల్సి కావాల్సింది. కాని, ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదు. దీంతో సెస్ కార్యకలాపాలు, విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగింది.
కోర్టును ఆశ్రయించనున్న పాలక వర్గం..
ఎన్పీడీసీఎల్ లోకి సెస్ వెళ్లడంపై పాలక వర్గం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. సెస్ చైర్మన్ రామారావు లీగల్ అడ్వయిజ్ తీసుకుంటున్నట్లు సమాచారం. బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చైర్మన్, డైరెక్టర్ లు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు: సీఎండీ
సెస్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన సిరిసిల్ల సెస్ కార్యాలయంలో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఇన్నాళ్లు సెస్ ఆధ్వర్యంలో విద్యుత్ సేవలు, సరఫరా జరిగాయని.. సెస్ లైసెన్స్ రెన్యూవల్ కానందున సేవలు ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని చెప్పారు.
సమ్మర్లో కరెంట్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఓవర్ లోడ్ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు సామర్థ్యం పెంచాలని, ఒకే బ్రేకర్ పై ఉన్న రెండు ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 2491 సర్వీసులు పెండింగ్ ఉన్నాయని, రాబోయే మూడు నెలల్లో వాటిని మంజూరు చేయాలన్నారు.
తెలంగాణ మొత్తం అమలవుతున్న యూనిఫామ్ సర్వీస్ లైన్ చార్జెస్ (ఎస్ఎల్సీ ) ఎల్టీ లో 1 కిలో మీటరులోపు ఉన్న వ్యవసాయ, గృహ, పరిశ్రమల వినియోగదారులకు మేలు జరిగేలా తీసుకువచ్చిన టీజీఈఆర్సీ రెగ్యులేషన్ సెస్ పరిధిలో కూడా అమలు చేయాలని ఆదేశించారు. కిలోవాట్‌కు కేవలం రూ.1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్పీడీసీఎల్ లో అమలవుతున్న రూ. కోటి ప్రమాద బీమా సెస్ ఉద్యోగులకు కూడా కల్పిస్తామని చెప్పారు. రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం , ఫాల్ట్ ప్యాసేజీ ఇండికేటర్ల ను అమలు చేయాలని, 24/7 మానిటర్ చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ కంట్రోల్ రూమ్ ద్వారా విద్యుత్ సరఫరా తీరును గంట గంటకూ తెలుసుకోవచ్చని అన్నారు. వినియోగదారులకు మరింత చేరువై వారికి అన్ని కొత్త సర్వీసుల మంజూరు మీ సేవా కేంద్రాలు , గ్రామాల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెస్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని చెప్పారు.
వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు..
గత బీఆర్ఎస్ హయాంలో సెస్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 2006 లో చిక్కాల రామారావు సెస్ చైర్మన్ గా ఉన్నప్పుడు అక్రమాలు బయటకు వచ్చాయి. అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. 2022లో రామారావు సెస్ చైర్మన్ తిరిగి ఎన్నికయ్యారు. 2023 నవంబర్ 12న సెస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సెస్ లో కంప్యూటర్ గదిలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన సమాచారం మొత్తం బూడిదైంది.
ఈ ఘటనపై ఇప్పటి వరకూ దర్యాప్తు ఎటూ తేలలేదు. 2022 సెస్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ అక్రమంగా గెలిచినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ డైరెక్టర్ కొంతమంది గెలిచినా రీకౌంటింగ్ జరిగి తిరిగి బీఆర్ఎస్ డైరెక్టర్లు గెలిచినట్టు ప్రకటించుకున్నారనే ఫిర్యాదులున్నాయి. సెస్ లో జరుగుతున్న ఆవినీతి ఆరోపణల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ రెన్యువల్ చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
- గృహాల మీటర్లు 174598
- వాణిజ్య మీటర్లు 22283
- పరిశ్రమల మీటర్లు 1497
- పవర్ లూమ్ మీటర్లు 3479
- వ్యవసాయ మీటర్లు 80,888
- స్ట్రీట్ లైట్స్ కు సంబందించిన మీటర్లు 1409
- నీటి సరఫరా మీటర్లు 1869
- జనరల్ మీటర్లు(గుడులు,బడులు) 1111
- ఈవీ చార్జింగ్ స్టేషన్స్ 01
- హెచ్ టీ (హై టెన్షన్ )125
- హెచ్ పీ దాటిని విద్యుత్ మీటర్లు 127
- మొత్తం కనెక్షన్స్ 2,87,375
- వినియోగదారులు మొత్తం 3,86000
