రాష్ట్రంలో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్ స్టిట్యూట్తో రెడ్కో ఒప్పందం

 రాష్ట్రంలో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్ స్టిట్యూట్తో రెడ్కో ఒప్పందం

హైదరాబాద్​. వెలుగు: రాష్ట్రంలో తక్కువ కార్బన్ ఉద్గారాలు, శక్తి సామర్థ్యం ఉన్న, స్థిరమైన అభివృద్ధి దిశగా సోలార్ పవర్‌‌ను వేగవంతం చేయడమే లక్ష్యంగా టీజీ రెడ్కో సంస్థ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (జీజీజీఐ) తో మంగళవారం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా (జీజీజీఐ) గ్లోబల్ నైపుణ్యం, సాంకేతిక మద్దతును వినియోగించి, జాతీయ ప్రాధాన్యతలు, అంతర్జాతీయ వాతావరణ కట్టుబాట్లకు అనుగుణంగా సోలార్ ఎనర్జీ రంగంలో ముందుకు సాగనున్నారు.  

డిమాండ్ సైడ్ మేనేజ్‌‌మెంట్ (డీఎస్​ఎం), స్థిరమైన కూలింగ్, శక్తి సామర్థ్య భవనాలు, గ్రీన్ సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు, ఈ-మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సోలార్​ ఎనర్జీ కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తారు. 

అలాగే, బ్యాంకులకు అనుకూలమైన ప్రాజెక్ట్ పైప్‌‌లైన్ అభివృద్ధి, ఎస్కో నమూనాలు వంటి వినూత్న ఆర్థిక విధానాలను సులభతరం చేయడం, శిక్షణ, జ్ఞాన వినిమయ కార్యక్రమాల ద్వారా సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం పై దృష్టి సారిస్తారు. రాష్ట్రంలో సౌర శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘స్మార్టీబ్’ కార్యక్రమం కింద రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.  

రెడ్కో వైస్​ చైర్మన్​, ఎండీ అనిలా, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇనిస్టిట్యూట్ -ఇండియా  ప్రతినిధి సౌమ్య ప్రసాద్ గర్నాయక్ మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్కో జనరల్ మేనేజర్ జి.ఎస్.వి. ప్రసాద్,  జీజీజీఐ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ ప్రాంతీయ సీనియర్ అధికారి అశోక్ బోనం, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (ఎన్​పీసీ) హైదరాబాద్ డైరెక్టర్ డి. రాజనీకాంత్, క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ (సీపీఐ) అసోసియేట్ డైరెక్టర్ సార్థక్ ఖురానా పాల్గొన్నారు.