ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెట్ ( స్టేట్ ఎలిజిబులిటీటెస్ట్) దరఖాస్తు రుసుము రూ.1000 ఉండగా, రుసుము చెల్లించే క్రమంలో అదనంగా మరో రూ.29 మొత్తంగా కలిపి రూ. 1,029 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం లేని విద్యార్ధులు, స్వతహాగా మొబైల్ ఫోన్ను వినియోగించి దరఖాస్తు చేసుకోలేని విద్యార్ధులు ఇంటర్నెట్ లేదా మీసేవ సర్వీసులు తదితర మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో రూ.100 లేదా 150 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే మొత్తంగా దాదాపు రూ.1200 చెల్లించారు.
ఇదీ కేవలం ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ డిజేబుల్డ్ అభ్యర్థులకు మాత్రమే. ఓసీ, బీసీ, ఇతర జనరల్ అభ్యర్థులకు మరో రూ.200 నుంచి రూ.300 గా నిర్ణయించారు. ఇదే ధోరణిలో నిన్న, మొన్న విడుదల చేసిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ -2026) కీ సంబంధించిన దరఖాస్తు రుసుము పేపర్ -1 కి రూ.750 కాగా, పేపర్ - 2 కి రూ.750 గా నిర్ణయించారు. ఒకవేళ అభ్యర్ధి రెండు పేపర్లకి అర్హత కల్గి ఉంటే రూ.1000 గా ప్రకటించారు. ఇందులోనూ మళ్ళీ దరఖాస్తు రుసుము చెల్లించే సమయంలో అదనంగా రూ.29 చెల్లించాలి. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకు రూ.150 సర్వీస్ చార్జి చెల్లించాలి. మొత్తంగా అంటే ఒక్కో అభ్యర్ధి రూ.900 చెల్లించాలి అన్న మాట.
ఈ తరహాలో ఈ మధ్య కాలంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నోటిఫికేషన్ల దరఖాస్తు రుసుములు తలకు మించిన భారంగా మారుతున్నాయి. అదనంగా రూ.29 చెల్లించే విధానాన్ని తొలగించి విద్యార్థులకు ఆర్థిక భారాన్నీ తగ్గించాలి. ఇదే కోవలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నెట్, సీటెట్ లాంటి అర్హత పరీక్షల దరఖాస్తు రుసుములు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల దరఖాస్తు రుసుములో కేవలం సగం మాత్రమే.
అలాగే అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం దరఖాస్తు రుసుము ఏంతో అంతమాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అర్హత పరీక్షల రుసుములు అందుబాటులో ఉండేలా నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తారని ఆశిద్దాం.
- ధని ముదిగొండ
